సత్యం.. అహింస.. మానవుడికి రెండు ఆయుధాలు లాంటివి. అహింసకు మహాత్మాగాంధీ గారు మారుపేరు అయితే, ఇక సత్యానికి శిబి చక్రవర్తి పెట్టింది పేరు. ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది అని చెప్పడానికి ఇప్పుడు ఒక కథను వినిపిస్తాము. అదేమిటో ? సత్యానికి ఉన్న శక్తి ఏమిటో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి..

శిబి చక్రవర్తి ఆపదలో ఉన్న వారికి లేదనకుండా, కాదనకుండా సహాయం చేస్తూ ఉండే వారు. ఎవరు ఏమి అడిగినా దానం చేయడంలో ఈయనకు మించిన వారు మరొకరు లేరు. ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది. తనను కాపాడమని శిబిచక్రవర్తి ని బతిమాలింది సరే కాపాడతానని ఆయన మాట ఇచ్చాడు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక డేగ, పావురం దగ్గరకు వచ్చింది. ఈ పావురం నా ఆహారం..నేను తినాలి.. దాన్ని నాకు ఇచ్చేయండి అని శిబి చక్రవర్తిని కోపంగా అడిగింది డేగ.
ఇక పావురాన్ని ఇవ్వను.. దానికి బదులుగా నీకు ఇంకా ఏదైనా ఆహారాన్ని ఇస్తాను అడుగు అని అన్నాడు శిబి చక్రవర్తి. అయితే పావురం అంత బరువు గల నీ తొడ మాంసము ఇవ్వు అని అడిగింది డేగ. శిబి చక్రవర్తి త్రాసు తెప్పించి, ఒకవైపు పళ్లెంలో తన తొడ మాంసం కోసి వేశాడు. ఇంకొక పళ్ళెంలో పావురాన్ని కూర్చోబెట్టారు. ఇక ఎంత మాంసం కోసి వేసినా, పావురంతో సమానం కాలేదు. చివరికి తానే త్రాసులో పళ్ళెంలో కూర్చున్నాడు. ఇక పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్ని అంతా తినేయ్ అని డేగను వేడుకొన్నాడు.వెంటనే డేగ ఇంద్రుడి గా మారింది.
పావురం అగ్నిదేవుడి గా మారింది. వాళ్ళని చూసి శిబిచక్రవర్తి ఆశ్చర్యపోయాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇలా అన్నారు.. ఓ శిబిచక్రవర్తి  ! మేము.. నిన్ను పరీక్షించాలని వచ్చాము. ఈ పరీక్షలో నీవు గెలిచావు. నీ దానగుణము, త్యాగగుణము చూసి మేము సంతోషించాము. నీవు గొప్ప దాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది.. అని దీవించి అక్కడి నుండి అదృశ్యమయ్యారు దేవతలు. ఇక నాటి నుంచి ఎప్పటికీ శిబి చక్రవర్తి గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయారు..


మరింత సమాచారం తెలుసుకోండి: