సాధారణంగా మన జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక అపాయం ఎదురయ్యే ఉంటుంది. ఆ అపాయం నుంచి బయట పడాలి అంటే మనం సరైన ఉపాయం చేయాలి లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఈ విషయానికి సంబంధించిన ఒక కథను ఇక్కడ చదివి తెలుసుకోండి.
అనగనగా పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున ఒక రాజమందిరం ఉండేది. దానికి కొంచెం దూరంలో ఒక చెట్టు పైన కాకి గూడు నిర్మించుకుని ఉంటుండగా, ఆ చెట్టు కిందనే వున్న పుట్టలో పాము కూడా నివసిస్తూ ఉండేది. కాకి తన పిల్లలకి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి , పాము మెల్లగా చెట్టు పైకి పాకి, కాకి పిల్లలను తినేస్తూ ఉండేది.దీంతో ఏం చేయాలో తెలియక రోజూ తెగ బాధపడిపోతూ ఉండేది.
ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకి కి ఒక మంచి ఉపాయం తోచింది. ఉపాయం వచ్చిందే తడవుగా ఒడ్డునే ఉన్న రాజ మందిరంలోకి ప్రవేశించి, అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే, రాణి గారి గది లోకి వెళ్లి ఆమె నగను , తన నోటకరచుకొని ఎగిరిపో సాగింది. భటులు కూడా రాణిగారి నగర తీసుకురావడానికి కాకిని వెంబడించారు. తన గూడును ఏర్పాటు చేసుకున్న చెట్టు కొమ్మ పైన వాలిన కాకి, తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే, నోటిలో వున్న నగను ఉన్న చెట్టు కింద ఉన్న పాము పుట్టలోకి జారవిడిచింది.
దాంతో రాజ భటులు గుణపాలు , పారలు తెచ్చి త్రవ్వగా, ఇక పుట్టలో ఉన్న రాజ భటుల పై కోపంతో బుసలు కొట్టింది. దీంతో రాజభటులు తమ దగ్గరున్న ఆయుధాలతో పామును చంపేసి , రాణిగారి నగాను తమతో తీసుకు వెళ్లి రాణి గారికి అప్పగించారు. ఇక పాము పీడ విరగడయింది అని సంతోషించిన కాకి ,తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది. ఎంతటి అపాయం వచ్చినా సరే తెలివిగా ఆలోచించి, ఆ అపాయం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.