ఒక ఊరిలో రామయ్య అనే భూస్వామి ఉండేవాడు. అందరికంటే తానే తెలివైన వాడినని అతడి నమ్మకం. తన కింద పనిచేసే నౌకర్లమీద తెలివిని ప్రదర్శిస్తూ, వారిని హేళన చేస్తుండేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో ఉండగా పొరుగూరి నుంచి ఒక వ్యక్తి వచ్చి ..మీ బావ గారు పంపించారు అని చెప్పి. కోడికూర ద్రాక్షరసం ఉన్న ఒక బుట్టను ఇచ్చి తన దారిన తాను వెళ్లిపోయాడు.
     

రామయ్య అటుగా వెలుతున్న ఒక నౌకరు ని పిలిచి దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరా. జాగ్రత్త రోయ్ మూతతీయకు.. ఇందులో ఒక పిట్ట.. సిసాడు విషం ఉన్నాయి. పిట్ట ఎగిరిపోతే కష్టం అన్నాడు. ఆ నౌకరు బుట్టను నెత్తి మీద పెట్టుకొని వెళ్లగానే, మిగతా వాళ్ళతో ఇలా చెప్పేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు ఎలా ఉంది నా తెలివి' అంటూ పగలబడి నవ్వాడు.
     

బుట్ట తో బయలుదేరిన నౌకరు అంత కంటే తెలివైన వాడు.. యజమాని అలా చెప్పాడంటే కచ్చితంగా అందులో ఇంకేదో ఉండి ఉంటుందనుకున్నాడు. దారి మధ్యలో ఒక చెట్టు దగ్గర ఆగి , బుట్ట మూత తీసి చూశాడు. అందులోని కోడి కూర వాసన గుమగుమలాడింది. సీసాలోని ద్రాక్షరసం నోరూ రించింది అంతే. వెంటనే ఆ కూరనూ , ద్రాక్ష రసాన్ని ఖాళీ చేసి హాయిగా నిద్రపోయాడు. పొలం పని పూర్తి చేసి ఇంటికి వచ్చిన రామయ్యకు బుట్ట అందలేదని తెలిసింది. నౌకరు మీద కోపంతో అతడిని వెతుక్కుంటూ వెళ్ళాడు.
 

మార్గ మధ్యలో ఓ చెట్టు కింద గుర్రు పెడుతూ కనిపించాడు ఆనౌకరు. అతడి దగ్గరకు వెళ్లి' ఒరేయ లే బుట్ట ఏది' అంటూ గద్దించాడు రామయ్య. ఆ అరుపులకు మెలుకువవచ్చిన నౌకరు చటుక్కున లేచి తప్పయిపోయింది దొరా. బుట్టలో పిట్ట ఎగిరి పోతుందేమోనని జాగ్రత్తగా పట్టుకోస్తుంటే గాలికి రాయి తగిలి తూలానయ్యా ..దాంతో మూత  ఊడిపోయి పిట్ట ఎగిరిపోయింది. మీరు తిడతారన్న భయంతో చచ్చి పోదాం అని సీసాలోని విషయం తాగేశానయ్యా అయినా చావలేదు. ఎందుకనో అన్నాడు వినయంగా చేతులు కట్టుకొని

తాను ఎగతాళిగా అన్న మాటలు తనకే తిప్పికొట్టిన నౌకరు తెలివి తేటలకు కంగుతిన్న రామయ్య ఏమీ మాట్లాడలేక ఇంటి దారి పట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: