పూర్వం అవంతిపురంలో విష్ణుశర్మ అనే ఒక గురువు ఉండేవారు. విష్ణు శర్మ సకల విద్యలూ తెలిసినవాడు. అతని వద్ద రవివర్మ , కిషోర్ వర్మ ,ప్రశాంత్ వర్మ, కీర్తివర్మ అనే నలుగురు రాజకుమారులు విద్యను అభ్యసించేవారు. వారంతా బుద్ధిలో మంచివారే..కానీ ఒక లోపం ఉండేది. ఏ పనినైనా ఉత్సాహంగా మొదలుపెట్టేవారు. కానీ కొంత సేపటి తరువాత ఉత్సాహం పోయి విసుగు..చిరాకు వచ్చేవి. ఆ పని పూర్తి చేయకుండానే ఇంకో పనిని మొదలు పెట్టేవారు. దీన్ని గమనించిన విష్ణు వర్మ వారిలో మార్పు తేవాలని అనుకున్నాడు.

ఒకరోజు రాజకుమారులను పిలిచి మన ఆశ్రమంలో ఒకే ఒక  మంచి నీళ్ల బావి ఉంది. వచ్చేది ఎండాకాలం.. అందుకే మరో బావిని ఇప్పటి నుంచి తవ్వి ఉంచుకుంటే మంచిది. ఆశ్రమానికి ఉత్తర దిక్కున తవ్వితే మంచి ఫలితం ఉంటుందని నాకు అనిపిస్తోంది. కాబట్టి  ఈ పనిని గ్రామస్తులలో చేద్దాం అనుకున్నాను. కానీ మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీకే చెబుతున్నాను. కాబట్టి మీరు త్వరగా బావిని తవ్వుతూ ఉండండి. నేను గ్రామస్తులను తీసుకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు విష్ణుశర్మ.. అతడి మాటలు పూర్తి కాకముందే నలుగురు పలుగూ పారా పట్టుకొని పరుగుతీశారు. ఒకరు పలుగుతో తవ్వుతుంటే.. ఇంకొకరు పారతో మట్టిని తట్టలో ఎత్తారు.


మిగతా ఇద్దరూ ఆ మట్టిని దూరంగా పోయసాగారు. కొంతసేపటి తరువాత విష్ణు శర్మ అక్కడికి వచ్చారు గొయ్యి తవ్వుతున్న కుమారులను పిలిచి..ఇక్కడ తవ్వటం ఆపేసి అటువైపు తవ్వండి అని ఇంకో ప్రదేశం చూపించాడు.. గురువుగారు ఎందుకలా చెప్పారో వాళ్ళకి అర్థం కాలేదు. బహుశా అక్కడ నీళ్లు పడవేమో అని  అనుకున్నారు.. మారు మాట్లాడకుండా వాళ్లు  ఆయన చెప్పిన స్థలంలో పని మొదలుపెట్టారు. మరికొంత సేపటి తరువాత విష్ణుశర్మ వాళ్లకు ఈ సారి  మరోప్రాంతం చూపించారు. దాంతో అక్కడ తవ్వకం ప్రారంభించారు. కొంత సమయం గడిచాక మరో స్థలాన్ని కూడా చూపించాడు. ఇంతవరకు సహనంతో పని చేస్తూ వచ్చిన రాజకుమారులకు ఒక్కసారిగా చిరాకు , కోపం వచ్చింది.


ఇలా అక్కడింత.. ఇక్కడింత.. తవ్వుతుంటే బావి ఎప్పటికి పూర్తవుతుంది. అని ప్రశ్నించారు.. దానికి విష్ణుశర్మ ఎందుకు పూర్తవదు... తప్పకుండా పూర్తవుతుంది మీరు అది కొంతా ఇది కొంతా చదువుతూ మీ చదువును ఎలా పూర్తి చేస్తారో అలాగే ఈ బావి కూడా పూర్తవుతుంది అని అన్నారు. ఆ మాటలకు వాళ్లకు అసలు విషయం అర్థమై సిగ్గుతో తలదించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఏ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: