ఒక వ్యాపారస్తుడు తన పని వాడితో ఎడ్లబండి మీద అమ్మవలసిన సరుకులను వేసుకుని పొరుగూరిలో వున్న సంతకి బయలుదేరాడు..కానీ అక్కడికి వెళ్లడానికి దారి సరిగ్గా లేదు. చాలా గోతులు, గుంటలు కూడా ఉన్నాయి. వాన మూలంగా ఆ గుంతల్లో నీళ్లు నిలిచిపోయాయి.. అందుకే ఆ వ్యాపారస్తుడు జాగ్రత్తగా నిదానంగా బండి తోలుకుంటూ కొనసాగారు.. అందుమూలంగా అనుకున్న సమయానికి వేగంగా వెళ్లలేకపోతున్నారు ఆ వ్యాపారస్తుడు.


ఇలా ఆలస్యమైతే కొట్టు పెట్టుకోవడానికి మంచి చోటు దొరకక పోవచ్చు అని.. సంతలో లాభం తగ్గిపోతుందేమో అని వ్యాపారస్తుడు చాలా దిగులుగా ఉన్నాడు.
ఉన్న కష్టాలు సరిపోవు అన్నట్లుగా.. హఠాత్తుగా ఉన్నట్టుండి బండి  ఒక చక్రం గుంతలో దిగి మట్టిలో సగం వరకూ  ఇరుక్కుపోయింది. వ్యాపారస్తుడు ఎద్దులను ముందుకు నెట్టిన కొద్దీ చక్రం ఇంకా ఇంకా గుంత లోపలికే  కూరుకుపోతోంది.. ఉన్న సమయం తక్కువ.. మధ్యలో ఈ చక్రం గొడవ..వ్యాపారస్తుడు చేతులు జోడించి మనసంతా పెట్టి దేవుడిని ప్రార్థించాడు.


"దేవుడా! ఎలాగైనా సరే  ఈ ఆపద నుంచి నన్ను కాపాడు తండ్రి!" అని మొక్కుకున్నాడు..వెంటనే
దేవుడు ప్రత్యక్షం అయ్యాడు." ప్రతి చిన్నదానికి నువ్వు నన్ను తలచుకోవటం ఎందుకు? నువ్వు బండి మీద కూర్చుని సమస్య అదే తీరిపోవాలంటే ఎలా కుదురుతుంది? ఒకళ్ళు దిగి మట్టిలోంచి.. చక్రం  తోయ్యండి. మరొకరు చిన్నగా ఎడ్ల ను ముందుకు తోలండి" అని సలహా ఇచ్చి అదృశ్యం అయిపోయాడు దేవుడు..

ఇక  పనివాడు దిగి చక్రం వెనుక భుజం పెట్టి చక్రాన్ని మట్టిలోంచి తోసాడు. వ్యాపారస్తుడు అదే సమయాన ఎద్దులను ముందుకు నెట్టాడు. అలా చక్రం గుంటలో నుంచి బయటపడి బండి మళ్లీ కదలడం మొదలుపెట్టింది. అలా ఆరోజు వ్యాపారస్తుడు సంత కి వెళ్లి కూరగాయలు  అమ్ముకున్నాడు లాభాలు సంపాదించుకున్నాడు. సమస్య వచ్చినప్పుడల్లా "దేవుడా! కాపాడు!"అనుకోకుండా మనకు తగ్గ కృషి మనం చేస్తే తప్పకుండా  ఆపై భగవంతుడు ఎలాగు అడగకుండానే సహాయం చేస్తాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: