ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి చాలా బలం ఉందని చాలా పొగరు.. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఏడిపించేది, హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూడ సాగాయి. అడవిలో సింహాలు, పులులు ఏనుగుల వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవి లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది.

ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులన్నింటినీ పిలిపించింది.ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్లు ఎవరైనా ఉన్నారా ఉంటే నాతో పోటీకి రండి లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును మీరంతా నేను చెప్పినట్టు వినాలి. అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలని అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి "ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దూకుతా నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటకి లాగగలవా నీటిలో ఎదురించే మొనగాళ్లు నాకు ఎవరూలేరు."అనింది.

 ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ "ఏంది... నిన్నునేను బయటకి లాగాలేనా గట్టిగా ఒక్క లాగు లాగానంటే ఎగిరి చెరువులో నుంచి బయటకు వచ్చి పడతావు నేను పోటీకి సిద్ధం"అంది
తాబేలు.. సరే అయితే నేను నీళ్లలో బాగా అడుగుకు పోతాను. చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడు కట్టుకుని బుడుంగున నీళ్లలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందకు పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడు కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలిదు కదా... దాంతో లాగడం మొదలుపెట్టింది.

ఎంత లాగినా తాడు మాత్రం కదలడం లేదు. లాగి లాగి దాని చేతులు నొప్పి పుట్టాయి. ఆఖరికి ఇంకా నా చేత కాదు'అంటూ తల దించుకుంది.. వెంటనే ఆ తాబేలు మరలా తాడును తన కాలికి కట్టుకుంది. ఏమీ తెలియని నంగనాచి లాగా పైకివచ్చి  "ఓస్.. నీ బలం ఇంతేనా... ఏదో పెద్ద వీరునివి అనుకున్నావే ఎన్ని రోజులు" అంది అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులు  
వేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: