నమ్మకం.. నమ్మకం.. తాను మొదటి నుంచీ ఉన్నవాడినన్న నమ్మకం.. అధినేత అభయంపై నమ్మకం..! కానీ ఎక్కడో అపనమ్మకం! మరెక్కడో భయంభయం! అయ్యయ్యో.. ఆఖరికి అభయంలోని భయమే నిజమైందే! ఆయన పెద్దరికాన్ని గద్దలకేశారే..? సిరికొండ ఎవరికీ గొరగాకుండా అయ్యారే..! అదేదో మోటు సామెత.. నమ్మితిరా సిద్దా అంటే... కుమ్మితిరా ముద్దా..! అన్నట్టుంది రాజకీయ యవ్వారం..! నిజానికి.. తెలంగాణ ఉద్యమ సమయంలో అధినేతకు కుడిభుజంలా ఆయన నిలిచారు. రాళ్లూరప్పలూ పట్టుకుని తిరిగారు. రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అందుకు తగ్గఫలితమే దక్కింది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో శాసన సభాపతి అయ్యారు. అపారమైన గౌరవం పొందారు. ఐదేళ్లపాటు ప్రజల మధ్య ఉన్నారు. అందులోనూ చెంచులకు కొత్తజీవితాన్ని అందించారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కానీ.. ముందస్తు ఎన్నికల్లో బోల్తాపడ్డారు. నియోజకవర్గం హస్తంపాలైంది. ఆ ఓటమికి ఎవరినీ నిందించలేదు. మరెవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనలేదు. ప్రజాతీర్పును గౌరవించి, అధినేతపై నమ్మకం పెట్టుకున్నారు. పార్టీకి విధేయుడిగానే కొనసాగుతున్నారు.
అయితే, తనకు ఏదో ఒకరోజు సముచిత గౌరవం ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. తనను రాజ్యసభకు పంపిస్తారన్న ఆశతో ఎదురుచూశారు. కానీ.. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. సమీకరణాలు కలిసిరాలేదు. తనకు ఓ మాజీ సభాపతి ఎసరు పెడుతారని అస్సలు ఊహించి ఉండరు. ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అని మరోసారి నిరూపితమైంది. ముందు నుంచీ ఉన్నవాడు అడుగున పడిపోయాడు. ఇక ఎటుచూసినా రాజకీయ జీవితం పుంజుకునే అవకాశాలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుని ముందుకు వెళ్లలేని తనయులు.. కొడుకులను ఎక్కడికో తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ.. వాళ్ల పనితీరుతో నాయననే చేజేతులా అడుక్కునెట్టారు. ప్రస్తుతం తండ్రీతనయుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. దిక్కు తెలియక, దారితోచక.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాపం.. వీళ్లను ఏదోఒకరోజు అధినేతే మళ్లీ కనికరించాలిమరి. ముందుముందు ఏం జరుగుతుందో చూద్దాం!