జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. వీళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని దెబ్బతీస్తే కానీ లేకపోతే వీళ్ళ మధ్య చీలిక తెస్తే కానీ దెబ్బకొట్టటం సాధ్యం కాదని ఎల్లోమీడియా డిసైడ్ అయినట్లుంది. అందుకనే ప్రతి ఆదివారం రాస్తున్న కొ(చె)త్తపలుకులో ఇదే విషయమై ఎల్లోమీడియా యజమాని వేమూరి రాధాకృష్ణ చాలా కష్టపడ్డాడు. తాను రాసే కాలంలో తన మనసులోని మాటను పరోక్షంగా బయటపెట్టుకున్నాడు.
ఇంతకీ ఆయన రాసిన రాతలు ఏమిటంటే భవిష్యత్తులో జగన్ తో తనకు చెడితే ఆయన వ్యవహారాలను మాత్రం బయటపెట్టరని గ్యారెంటి ఏమిటి ? అంటూ గుంటూరులోని ఓ మిత్రుడు వేమూరిని అడిగాడట. ఇదే విషయాన్ని మరికొందరు కూడా అభిప్రాయపడ్డారని తన కాలంలో రాసుకున్నాడు. కాలం చదవిన తర్వాత అందరికీ అర్ధమవుతున్నదేమంటే అర్జంటుగా జగన్-విజయసాయి మధ్య గొడవలొచ్చి విడిపోవాలని. గతంలో తాను సుజనా చౌదరి కంపెనీల్లో పనిచేసినట్లు విజయసాయి చెప్పుకున్నాడట. సుజనా కంపెనీల్లో తప్పులు జరిగాయని ఇపుడు ఎంపి బయటపెట్టటంలో ఆంతర్యం ఏమిటి ? అనే లాపాయింటును వేమూరి బయటకు లాగాడు.
సుజనా కంపెనీల్లో తప్పులు జరిగితే అందుకు విజయసాయిది కూడా బాధ్యతుంటుందని వేమూరి తేల్చేశాడు. అలాగే సుజనా అంటే తనకు పడదు కాబట్టి ఇపుడు విజయసాయి విషయాలు బయటపెడుతున్నట్లు ఎల్లోమీడియా చెప్పింది. ఇదే విధంగా భవిష్యత్తులో జగన్ తో కూడా విజయసాయికి చెడితే అప్పుడు జగన్ విషయాలు కూడా బయటపెడతాడని చెప్పటంతోనే వేమూరి ఆలోచనేంటో అర్ధమవుతోంది.
ఇప్పటికిప్పుడు జగన్-విజయసాయికి మధ్య గొడవలొచ్చి విడిపోవాలని కోరుకుంటున్న విషయం అర్ధమైపోయింది. అలాగే జగన్ కంపెనీ వ్యవహారాలన్నింటినీ విజయసాయి బయటపెట్టాలని వేమూరి కోరుకుంటున్నాడు. అదే సమయంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వైసిపి ఎంపికి మధ్య జరిగిన మాటల యుద్ధం హఠాత్తుగా ఆగిపోవటాన్ని కూడా ఎల్లోమీడియా తట్టుకోలేకపోతోంది. నాలుగు రోజుల క్రితం జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో కరోనా పరీక్షల కిట్ల కొనుగోలు విషయంలో వెనక్కు తగ్గద్దని నడ్డా చెప్పినట్లు రాసుకున్నారు.
ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వదలద్దని మీకు మేమున్నామంటూ నడ్డా కన్నాకు భరోసా ఇచ్చినట్లు రాసుకున్నారు. తీరా ఆదివారం చెత్తపలుకులో చూస్తే అధిష్టానం తరపున ఎవరికి ఏమి చెప్పిందో కానీ రెండు వైపులా వివాదం సద్దుమణిగిందని బాధపడిపోయాడు. అంటే ఎల్లోమీడియా ఉద్దేశ్యంలో రెండు పార్టీల మధ్య వివాదం పెరిగిపోతుందని, జగన్, విజయసాయికి ఇబ్బందులు మొదలవుతాయని ఆశించినట్లే ఉంది. కానీ వివాదం సద్దుమణిగిపోయేటప్పటికి ఎల్లోమీడియా తెగ బాధపడిపోతోంది.