
నారా వారి పుత్రరత్నం లోకేష్ కూడా ఛాలెంజులు విసురుతున్నాడు. సోషల్ మీడియాలో తమ కార్యకర్త రంగనాయకమ్మ పెట్టిన పోస్టునే తాను కూడా పోస్టు చేస్తున్నానని తనను కూడా అరెస్టు చేయాలంటూ ప్రభుత్వానికి సవాలు విసిరాడు. అరెస్టు విషయంలో లోకేష్ తన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే అనుకోవాలి. లాక్ డౌన్ కారణంగా దాదాపు 50 రోజులుగా తండ్రి చంద్రబాబునాయుడుతో పాటు లోకేష్ కూడా హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైపోయిన విషయం అందరికీ తెలిసిందే.
లాక్ డౌన్ అమలవుతున్నా జనాల్లోకి వచ్చి పార్టీ తరపున కార్యక్రమాలను చేపట్టే అవకాశాలున్నా అన్నింటినీ పక్కనపెట్టేసి హ్యాపీగా ఇంట్లోనే లాక్ డౌన్ అయిపోయాడు. ఎప్పుడైతే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఇంట్లోనే కూర్చోవటంతో మిగిలిన నేతలు కూడా జనాల్లోకి పెద్దగా రాలేదు. విచిత్రమేమిటంటే లోకేష్ ప్రతిరోజు జనాలను ట్విట్టర్ వేదిక ద్వారా మాత్రమే పలకరిస్తున్నాడు. పార్టీలో చోటా మోటా నేతలు కూడా అప్పుడప్పుడు జనాల్లోకి వెళ్ళినా లోకేష్ మాత్రం అటువంటి ప్రయత్నమే చేయలేదు.
ఈ నేపధ్యంలోనే ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాదం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు, లోకేష్ తో పాటు ఇతర నేతలు ఎంత రచ్చ చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. పానకలంలో పుడక అనే సామెతలాగ మధ్యలో గుంటూరుకు చెందిన టిడిపి యాక్టివిస్టు రంగనాయకమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రమోట్ చేసిన పోస్టులపై సిఐడి నోటీసులుందుకుంది. మూడురోజుల క్రితమే విచారణకు కూడా హాజరయ్యింది. ఆ విషయమై తండ్రి, కొడుకులు పెద్ద రచ్చే చేశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రంగనాయకమ్మ పోస్టులను తాను కూడా పోస్టు చేస్తున్నట్లు చెప్పిన లోకేష్ తనను కూడా అరెస్టు చేసుకోమ్మంటూ ప్రభుత్వానికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వం రంగనాయకమ్మను అరెస్టే చేయలేదు. కేవలం విచారణకు మాత్రమే పిలిపించారు. సోషల్ మీడియాలో పోస్టులు ప్రమోట్ చేసినందుకే రంగనాయకమ్మ ఇంత పాపులరయ్యారు. ఇదే పోస్టులను తాను కూడా ప్రమోట్ చేస్తే తనకు ఇంకెంత ప్రచారం వస్తోందో అని లోకేష్ ఆలోచించినట్లే ఉన్నాడు.
సోషల్ మీడియా అనగానే @ysjagan గారి వెన్నులో వణుకు మొదలవుతుంది. అసమర్థ పాలన సోషల్ మీడియా ద్వారా బయటకువస్తుంది అనే భయం ఆయనను వెంటాడుతోంది. రంగనాయకమ్మ గారు పెట్టిన పోస్టునే నేను కూడా పెడుతున్నా. నన్ను కూడా అరెస్ట్ చేసుకోండి.#ArrestMeToo #WeStandWithRanganayakamma pic.twitter.com/VqUYU5JEmM
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 23, 2020
ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా తండ్రి, కొడుకులు ఇంకా కొంత కాలం పాటు క్షేత్రస్ధాయిలోకి వెళ్ళే అవకాశాలు కనబడటం లేదు. జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లేయటం ద్వారా మాత్రమే ఎల్లోమీడియాలో ప్రచారం తెచ్చుకుంటున్నారు. ట్విట్టర్లో పోస్టులు, ప్రచారం, విచారణ, అరెస్టులతో కొత్త తరహా ప్రచారాన్ని లోకేష్ కోరుకుంటున్నట్లే అనిపిస్తోంది. మొత్తానికి లోకేష్ కోరికను ప్రభుత్వం తీరుస్తుందో లేదో చూడాల్సిందే.