ఫై ఇమేజిని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది ?  జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సాక్షి కన్నా ఈనాడు పత్రికే మేలని అనిపించటం లేదా ? ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో రూ. 18 వేల కోట్లతో తొమ్మది భారీ పరిశ్రమలంటూ ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వార్త వచ్చింది. దాని తరువాయి భాగమంటూ 2వ పేజీలో కంటిన్యుయేషన్ ఇచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అన్నదే కనబడటం లేదని ఒకవైపు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న విషయం అందరు చూస్తున్నదే. సరే ఇందులో కొంత వాస్తవం కూడా ఉందిలేండి.

 

ఏడాది పాలనలో సంక్షేమ పథకాల అమలుపై పెట్టిన దృష్టి అభివృద్ధిపై పెట్టటం లేదనే విషయం జనాల్లో కూడా చర్చ జరుగుతోంది. అయితే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నంత ఘోరంగా అయితే పరిస్ధితి లేదన్నది వాస్తవం. కడపలో స్టీలు ఫ్యాక్టరీకి శంకుస్ధాపన చేశాడు. అలాగే అక్కడక్కడ పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయిస్తోంది ప్రభుత్వం. కొన్ని పరిశ్రమల యాజమాన్యాలతో పరిశ్రమల శాఖ చర్చలు కూడా జరుపుతోంది. ఇవన్నీ చర్చలు, శంకుస్ధాపనల దశలోనే ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి నేపధ్యంలోనే  తొమ్మది భారీ పరిశ్రమలు రూ. 18 వేల కోట్లతో అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఏర్పాటు అవుతున్నాయంటే చిన్న విషయం కాదుకదా. ఇవన్నీ శంకుస్ధాపనల దశలు దాటుకుని నిర్మాణాలు మొదలైతే ప్రతిపక్షాల ఆరోపణలకు ఒక్కసారిగా ఫులుస్టాప్ పడినట్లవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతటి ప్రధానమైన వార్తను  ఎల్లోమీడియాగా తరచూ స్వయంగా జగనే ప్రస్తావించే ఈనాడులో మొదటిపేజీలో వచ్చింది కానీ సాక్షి దినప్రతికలో మాత్రం కనబడలేదు.

 

అసలు ఏ మీడియాలో వచ్చినా రాకపోయినా సాక్షి మీడియాలో మాత్రం ఇటువంటి వార్తలు, కథనాలు ప్రముఖంగా కనిపించాలి, వినిపించాలి. అలాంటిది సాక్షి మీడియానే ఈ వార్తకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇటువంటి అనేక పొరబాట్లు చాలానే జరిగాయి. జగన్ కు సాక్షి మీడియాలో పాజిటివ్ గా స్టోరీటు వస్తే అనుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే సాక్షి మీడియా అంటే జగన్ సొంత మీడియా అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. అందులోను క్షేత్రస్ధాయిలో జరుగుతున్న విషయాలను కూడా సాక్షి మీడియా గట్టిగా ప్రొజెక్టు చేసుకోలేకపోతే ఇంకెందుకు ?

 

ఒకవైపు ఎల్లోమీడియాగా ప్రచారంలో ఉన్న ఆంధ్రజ్యోతిలో బూతద్దం పెట్టి వెతికినా జగన్ పాజిటివ్ న్యూస్ ఒక్కటి కనబడదు. లేని విషయాలను, చిన్న ఘటనలను  కూడా జగన్ కు అంటగట్టి నెగిటివ్ వార్తలు, కథనాలు మాత్రమే ఆంధ్రజ్యోతి అందిస్తున్నపుడు సాక్షి మీడియా ఇంకెంత స్పీడుగా ఉండాలి పాజిటివ్ వార్తలు, కథనాలు అందించటంలో ?  మొత్తానికి జగన్ సొంత మీడియా సాక్షి కన్నా ఈనాడు అప్పుడప్పుడైనా మేలని అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: