ఏపీలో విపక్ష టీడీపీలో ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఓ వైపు మాజీ మంత్రి.. పార్టీలో కీలకంగా ఉంటూ వాయిస్ వినిపిస్తోన్న టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు.. ఆ మరుసటి రోజు మరో కీలక నేత అయిన, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని అరెస్టు చేశారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు సుధీర్‌బాబుతో కలిసి పార్టీ మారిపోయారు. ఇలా వరుస గందరగోళాల మధ్య మరి కొంత మంది పార్టీ మారిపోతారన్న వార్తలు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబును పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలే నమ్మడం లేదు. ఇక చంద్రబాబు ఎప్పుడూ ఎవరిని నమ్మరన్నది తెలిసిందే.
ఇక పార్టీలో కొందరు సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇవే ఇప్పుడు పార్టీ కొంప ముంచేస్తున్నాయి. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టే పార్టీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి అరెస్టు కావడంతో జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా జగన్ చంద్రబాబు మీదకు రాలేక మా లాంటి వాళ్లపైకి వస్తున్నారంటూ విమర్శించారు. జగన్ చంద్రబాబు జోలికి వస్తే భష్మీపటలం కాక తప్పదని కూడా జేసీ హెచ్చరించారు. వాస్తవంగా జేసీ మాట్లాడిన మాటలు విన్న టీడీపీ నేతలు అది హెచ్చరింపుగా లేదని.. నీకు దమ్ముంటే చంద్రబాబును అరెస్టు చేసి అని కవ్వించినట్లుగా ఉందని.. జేసీ చంద్రబాబు మీద ఈ రకంగా కసి తీర్చుకోబోతున్నారా ? అన్న సందేహాలు తెలుగు తమ్ముళ్లకు వస్తున్నాయి.
ఓయ్ జగన్ అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి లాంటి చిన్న చిన్న వాళ్లు కాదు నీకు దమ్ముంటే చంద్రబాబును అరెస్టు చేయి అని సవాల్ చేసినట్టుగా ఆయన మాటలు ఉన్నాయని టీడీపీ వాళ్లు చర్చించుకుంటున్నారు. ఇక జేసీ ఇదేం ప్రజాస్వామ్యం అని జగన్ పాలనపై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ వాళ్లు అయితే టీడీపీ ఐదేళ్ల పాలనలో జేసీ ఎన్నో అరచకాలు చేశారని.. ఆయనకు, ఆయన తమ్ముడికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని.. ఆయన ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువల గురించి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. ఇక హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే అవినీతి కేరాఫ్ అని తీవ్ర విమర్శలు చేశారు. ఏదేమైనా చంద్రబాబును అరెస్టు చేస్తే జేసీకి చూడాలని ఉందా ? అన్న సెటైర్లు ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే వస్తున్నాయి.