రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఇచ్చిన ఆత్మప్రభోదం నినాదం దారుణంగా దెబ్బ తినేసింది. అధికార వైసిపి నుండి ఓట్లను రాబట్టుకునేందుకు టిడిపి అభ్యర్ధి వర్లరామయ్య ఇచ్చిన నినాదం పూర్తిగా రివర్సు కొట్టేసింది. వైసిపి ఓట్లు రావటం అటుంచి చివరకు సొంత ఎంఎల్ఏలే జారిపోయారు. మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున 23 మంది ఎంఎల్ఏలు గెలిచారు. అంటే రాజ్యసభ ఎన్నికల్లో టిడిపికి 23 ఓట్లున్నట్లు లెక్క. కానీ చిరవకు వర్లకు వచ్చింది 17 ఓట్లు మాత్రమే. అంటే కారణాలు ఏవైనా కానీండి ఆరు ఓట్లు పోలు కాలేదన్న విషయం స్పష్టమైపోయింది.
నిజానికి రాజ్యసభ ఎన్నికల్లో ఏ విధంగా చూసినా టిడిపికి గెలుపు అవకాశమే లేదు. అలాంటిది పోటిలోకి దిగటమే కాకుండా ఆత్మప్రభోదంతో ఎంఎల్ఏలు ఓట్లేయాలని పిలుపివ్వటం చివరకు ఓవర్ యాక్షన్ గా నిలిచిపోయింది. అదేమంటే అప్పుడెప్పుడో దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధి ఆత్మప్రభోదం ఇచ్చిన నినాదం లాగే తాను కూడా ఇపుడు అదే నినాదాన్ని ఇస్తున్నట్లు చెప్పుకోవటమే అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే రాజకీయంగా ఇందిరాగాంధి తాను ఒకటే అనే అర్ధం వచ్చేట్లుగా వర్ల మాట్లాడటమే విచిత్రం.
ఎన్నికల్లో దిగేటప్పటికే పార్టీ నుండి ఇద్దరు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి దూరమయ్యారు. మార్చిలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ మధ్యలో కరణం బలరామ్ కూడా దూరమయ్యారు. అంటే మూడు ఓట్లు మైనస్ అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. దానికి తగ్గట్లే వాళ్ళు ముగ్గురు తమ ఓట్లను టిడిపి అభ్యర్ధికే వేసినా చెల్లుబాటు కాకుండా చేయటంతో చివరకు అవి ఇన్ వాలీడ్ అయిపోయాయి. వాళ్ళతో పాటు రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవని ఓటు కూడా తప్పుగా వేయటంతో ఇన్ వాలీడ్ అయిపోయింది. రిమాండులో ఉన్న కారణంగా అచ్చెన్నాయుడు, కరోనా వైరస్ అనుమానంతో అనగాని సత్యప్రసాద్ ఓటింగ్ చేయలేదు.
మొత్తం మీద టిడిపి అభ్యర్ధి తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నట్లుగానే అనిపిస్తోంది. ముందే ఓటమి ఖాయమని తేలిపోయిన ఎన్నికల్లో పోటికి వర్ల దూరంగా ఉండుంటే బాగుండేదనే అభిప్రాయం మొదటి నుండి పార్టీలో వినిపిస్తునే ఉంది. కానీ చంద్రబాబు మాయచేయటంతోనే చివరకు వర్ల పోటికి రెడీ అయిపోయినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఏదేమైనా పోటి చేయటం, ఓడిపోవటం అన్నది ముందు అనుకున్నదే. కాకపోతే టిడిపి ఇచ్చిన ఆత్మప్రభోదం నినాదమే దారుణంగా రివర్సవ్వటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.