నరసాపురం ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య టామ్ అండ్ జెర్రీ వేట మొదలైంది. ఎంపి ఎంత కాలం తప్పించుకుంటాడో ? ఎంపిపై జగన్ ఎంత తొందరగా వేటు వేయిస్తాడన్న విషయాన్ని కాలమే నిర్ణయించాలి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తున్న ఎంపిపై ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వేటు వేయించాలని నాయకత్వం డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఎంపికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశాడు. అయితే షోకాజ్ నోటీసుకు కృష్ణంరాజు ఇచ్చిన సమాధానమే విచిత్రంగా ఉంది.
తన సమాధానంలో ఎంపి అసలు పార్టీ అస్తిత్వాన్నే ప్రశ్నించాడు. తనకు నోటీసు ఇచ్చే అధికారం అసలు విజయసాయిరెడ్డికి ఉందా అంటూ నిలదీశాడు. అసలు పార్టీ పేరేమిటి ? అంటూ ప్రశ్నించాడు. పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉందా ? ఉంటే తనపై చర్యలు తీసుకోవాలని డిసైడ్ చేసిన మీటింగ్ వివరాలు ఏవి ? అంటూ నిలదీశాడు. సరే ఎంపి ఎదురుదాడి విషయంలో పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది ? ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ? అనే విషయాలు పక్కన పెట్టేద్దాం. పార్టీ నాయకత్వంతో ఎంపి ఘర్షణకు సిద్ధపడే సమాధానం ముసుగులో పార్టీ నాయకత్వాన్ని బాగా కెలికేశాడనే విషయం అర్ధమైపోతోంది.
మరి ఎంపిపై చర్యలు తీసుకునేందుకు పార్టీ నాయకత్వంపై ఉన్న ఆప్షన్లు ఏమిటి ? ఒకటి ఎంపి వ్యవహారాలను చూసి చూడనట్లు వదిలేసే సమస్యే లేదన్న విషయం అర్ధమపోయింది. కాబట్టి చర్యలు తీసుకునేందుకే రెడీ అవుతోంది నాయకత్వం. అయితే అందుకు మార్గమేంటి ? అన్నదే ఇపుడు నాయకత్వం ముందున్న అసలైన ప్రశ్న. ఇందుకు కనబడుతున్న మార్గం ఏమిటంటే ’వాలంటిర్లీ గివప్ మెంటర్ షిప్’ అనే పద్దతట. ఈ పద్దతి ఏమిటంటే తమ పార్టీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు కాబట్టి సదరు ఎంపిపై అనర్హత వేటు వేయాలని పార్టీ నాయకత్వం లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేస్తుంది. అప్పుడు స్పీకర్ ఫిర్యాదుపై విచారణ జరిపి ఎంపిపై వేటు వేస్తాడు.
అయితే వాలంటిర్లీ గివప్ మెంటర్ షిప్ అనే పద్దతిలో ఎంపిపై వేటు వేయటం అంత వీజీకాదు. ఎందుకంటే సదరు ఎంపి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పార్టీ నాయకత్వం నిరూపించాలి. ఇప్పటి వరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎక్కడా లేదు. కాకపోతే పార్టీ ఎంఎల్ఏలపై నోటికొచ్చినట్లు కామెంట్లు చేశాడంతే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులోని లోపాలను బహిరంగంగా కామెంట్ చేశాడు.
మరి వీటినే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా స్పీకర్ పరిగణిస్తాడా ? తెలీదు. చాలామంది గతంలో శరద్ యాదవ్ పై ఇదే పద్దతిలో వేటు వేశారు కదా అంటున్నారు. అయితే అప్పట్లో శరద్ యాదవ్ పై వేటుకు ఇపుడు కృష్ణంరాజుపై యాక్షన్ తీసుకోవటానికి చాలా తేడా ఉంటుంది. మరి జగన్ ఎంత పకడ్బందీగా వ్యూహం పన్నుతాడో చూడాల్సిందే.