జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్-1 పేరుతో విడుదల చేసిన ఇంటర్వ్యూ చాలా పేలవంగా ఉంది. ఏ విషయంలో కూడా తనకు సరైన అవగాహన ఉండదని పవన్ మరోసారి నిరూపించుకున్నాడు. చంద్రబాబునాయుడును విమర్శించాల్సొచ్చినపుడు ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి చెప్పదలచుకున్నాడో కూడా జనాలకు అర్ధంకాని రీతిలో సమాధానాలిచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటపుడు గట్టిగా ఆరోపణలు చేయలేక అలాగని మనస్పూర్తిగా అభినందించలేక అవస్తలు పడిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు హయాంలో జరిగిన వాటిని కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టేయటం చూస్తే అటు చంద్రబాబుపై ఆరోపణలు చేయలేక ఇటు జగన్ను నిందించలేక నానా అవస్తలు పడిన విషయం అర్ధమైపోతోంది.
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన స్కీంలో నిర్మించిన పది లక్షల ఇళ్ళను ప్రభుత్వం లబ్దిదారులకు ఇవ్వటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ యాంకర్ ఓ ప్రశ్న అడిగాడు. దానికి సమాధానమిస్తూ తాను కర్నూలు, మంగళగిరి ప్రాంతాల్లో పర్యటించినపుడు పూర్తయిన ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వలేదన్న విషయాన్ని బాధితులు చెప్పారన్నాడు. ప్రధాని ఆవాజ్ యోజన పథకంలో కట్టిన లక్షల ఇళ్ళు కట్టినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబే. మరి అప్పుడు చంద్రబాబుతో పవన్ కలిసే ఉన్నాడు కదా ? మరి లబ్దిదారులకు ఇచ్చేయాల్సిన ఇళ్ళను ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును పవన్ ఎందుకు నిలదీయలేదు ? చంద్రబాబు ఫెయిల్యూర్ ను జగన్ ఖాతాలో వేసేయటానికి పవన్ పడిన అవస్తలు అర్ధమైపోయింది.
ఇక రెండో ప్రశ్నగా కరోనా వైరస్ ను అరికట్టటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని వైద్య నిపుణులు చేసిన వ్యాఖ్యలపై స్పందించమని యాంకర్ అడిగాడు. పవన్ బదులిస్తు వైరస్ ప్రబలకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాల్సినంత జాగ్రత్తలు తీసుకోలేదంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. అనుమానితులందరికీ ప్రభుత్వం పరీక్షలు బాగా చేయిస్తోందని తాను ఈ మధ్యనే ట్వీట్ పెట్టానని, అది మనస్పూర్తిగానే పెట్టానని పదే పదే చెప్పుకున్నాడు. అంటే తాను జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ట్వీట్ చేసినా జనాలు నమ్మరని పవన్ అనుకుంటున్నాడా ? అనే అనుమానం వస్తోంది.
చివరగా పేదలకు ఇవ్వబోతున్న ఇళ్ళ స్ధలాల కోసం ప్రైవేటు భూములకు వాస్తవ ధరలకన్నా చాలా రెట్లు అధికంగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోందంటూ చంద్రబాబు+టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలనే చెప్పాడు. అంతేకానీ ఏ ఊరిలో ప్రభుత్వం వాస్తవ ధరకన్నా ఎక్కువ ధరలు చెల్లించిందో మాత్రం చెప్పలేదు. అలాగే రాజధాని అమరావతి వ్యవహారంపై మాట్లాడుతూ కాస్త ఆశ్చర్యకరమైన కామెంట్లే చేశాడు. భారీ ఎత్తున వేలాది ఎకరాలను సేకరించాలన్న చంద్రబాబు ఆలోచనకు అందరు మద్దతిచ్చినా తాను మాత్రం వ్యతిరేకించినట్లు చెప్పాడు.
34 వేల ఎకరాల్లో సింగపూర్ తరహా రాజధాని కట్టాలన్న చంద్రబాబు ఆలోచనను తాను వ్యతిరేకిస్తున్నట్లు పవన్ ఏనాడూ చెప్పినట్లు జనాలెవరూ వినలేదు. పైగా గుజరాత్ లో 3 వేల ఎకరాల్లో రాజధాని గాంధీనగర్ ను నిర్మించుకున్నట్లే అమరావతిని కూడా నిర్మించుకోమని ప్రధానమంత్రి నరేంద్రమోడి చెప్పినా చంద్రబాబు వినలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. అలాగే సింగపూర్ తరహా రాజధాని నిర్మించటం సాధ్యం కాదని ఇపుడు చెబుతున్న పవన్ మరి అప్పుడెందుకు నోరిప్పలేదు ? నిజానికి ప్రైవేటు వ్యక్తుల నుండి భూములు సేకరించొద్దని చెప్పింది జగన్. దాన్ని పవన్ రివర్సులో మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. మొత్తానికి కరోనా వైరస్ సమయంలో పవన్ ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటి భాగం మాత్రం చాలా పేలవంగా ముగిసిందనే చెప్పాలి.