కొన్ని ఆలోచనలు చిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు మేధావులకు కూడా రావేమో..!? అనుకునేంత గా అనిపిస్తాయి. ఇలాంటి చిత్ర విచిత్ర ఆలోచనలను గుదిగుచ్చి.. వారం వారం తెలుగు ప్రజలపై కుమ్మరించే ఎల్లో పలుకు ఒకటి ఇప్పుడు మరింత చిత్రమైన విషయాన్ని పలికింది. `` ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? హైకోర్టు తీర్పు అమలుకు కూడా గవర్నర్ జోక్యం చేసుకోవాలా?.. అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కరోనా వైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసింది. ఇలాగైతే అధికారులు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది ’’.. ఇది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం! న్యాయస్థానాలు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నందుకు ప్రభుత్వాలు సిగ్గుపడాలి``- ఇదీ.. ఎల్లో పలుకు ప్రారంభ పేరా!
దీనిని ఒకసారి విశ్లేషించుకుంటే.. ప్రస్తుతం ఈ ఎల్లో మీడియా భజన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోర్టులు తప్పుపడుతూనే ఉన్నాయి. అనేక సందర్భాల్లో మోడీ సర్కారు విధానపరమైన నిర్ణయాలు సహా.. ఆయా రాష్ట్రాలపై కన్నేసి వాటిలో అధికారం దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలను కూడా కోర్టు దుయ్యబట్టాయి. మరి ఆ సమయంలో (రాష్ట్రాలకు రాష్టాలను దోచేసేందుకు రెడీ అయినప్పుడు) బీజేపీని సమర్ధిస్తున్న ఎల్లో మీడియాకు ఇవి కనిపించలేదా? అంతెందుకు .. చంద్రబాబు ఏపీలో పాలన వెలగబెట్టిన సమయంలోనూ కోర్టులు ఆయన వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. అప్పుడు ఎల్లో మీడియా ఏమైంది ? కళ్లకు గుడ్డలు చుట్టుకుందా ? అన్నది పెద్ద ప్రశ్న.
ఇక, రెండో విషయానికి వద్దాం... `` తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏమిటి ? కోర్టు తీర్పులను, ఆదేశాలను అమలుచేయవలసిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా.. ఎదురుదాడికి దిగుతున్నాయి. ప్రజలు మాకు అధికారమిచ్చారు అని చెప్పి, రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడడానికి కూడా జగన్ రెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు వెనుకాడడం లేదు. ప్రాంతీయ పార్టీల నాయకులలో ఇటువంటి పోకడలు ఇటీవలి కాలంలో పెరిగిపోతు న్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఇటువంటి దుందుడుకు ధోరణికి తెగబడుతున్నారు``- అని ఎల్లో మీడియా ఉవాచ..!
ఈ అంశంలోని అర్దం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తిట్టిపోయడమే కాదు.. ఈ రాష్ట్రాల్లో రాజ్యాంగం అమలు కావడం లేదు కనుక.. ఇక్కడ వీరిద్దరిని తొలగించి.. రాష్ట్రపతి పాలన పెట్టాలనే అంతరార్థం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కొందరు, వస్తుందని వైఎస్సార్ సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాటికి మరింత బలం చేకూరుస్తూ.. ఎల్లో పలుకులు మరింత రెచ్చిపోయినట్టుగానే భావించాలి. నిజానికి బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ దూకుడు ఇప్పటిది కాదు.. గతంలోనే చంద్రబాబు ఏపీలో పాలన సాగిస్తున్న సమయంలోనే కొనసాగింది. అప్పట్లో ఆమెను సమర్ధించిన ఇదే ఎల్లో మీడియా ఇప్పుడు తమ వారు లేకపోయే సరికి ప్లేటు ఫిరాయించిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా ఏపీ, తెలంగాణల్లో రాష్ట్రపతి పాలన వస్తే.. ముందు సంతోషించేది వీరేనన్నమాట..!!