రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలనుండి కన్నా లక్ష్మీనారాయాణను తీసేయగానే కొందరు సీనియర్ నేతలు డ్యాన్సులు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కన్నాను తీసేస్తారనే విషయం చాలా కాలంగా నలుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు ఏదో అదృశ్య శక్తి కన్నాను కాపాడుతోందట. అయితే చివరకు అదృశ్యశక్తికి కూడా తెలీకుండానే అగ్ర నాయకత్వం కన్నాను తప్పించేసి ఎంఎల్సీ సోమువీర్రాజును అధ్యక్షుడిగా ప్రకటించేసింది. కన్నా ప్లేసులో సోమువీర్రాజును ప్రెసిడెంట్ గా నియమించినట్లు టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ చూసిన చాలామంది ముందు ఆశ్చర్యపోయారు. తర్వాత పిచ్చ హ్యాపీగా ఫీలయ్యారట. ఇందులో భాగంగానే కొందరు సీనియర్ నేతలు డ్యాన్సులు కూడా చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ కన్నాను తప్పిస్తే కొందరు సీనియర్లు ఎందుకంత హ్యాపీగా ఫీలయ్యారు ?
ఎందుకంటే కన్నా అధ్యక్షుడిగా ఉన్న రెండేళ్ళు ఏకపక్షంగానే వ్యవహరించాడు. పార్టీలో దశాబ్దాల పాటు ఉన్న నేతలను కాదని సొంతంగా ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నాడట. అదికూడా చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉన్న నేతలతోనే ఎక్కువగా జట్టుకట్టాడని చాలామంది నేతలు కన్నాపై అగ్ర నాయకత్వానికి చాలాసార్లు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన సుజనా చౌదరి లాంటి వాళ్ళ డైరెక్షన్లోనే కన్నా పనిచేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ విషయంలోనే కొందరు సీనియర్లకు కన్నాతో బాగా గ్యాప్ వచ్చేసింది. టీవీ చర్చల విషయంలో బలమైన వాయిస్ వినిపిస్తున్న కొందరు సీనియర్లకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి కన్నా షోకాజ్ నోటీసు ఇప్పించటమే కాకుండా సస్పెండ్ కూడా చేశారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.
నిజానికి పార్టీలోని లక్ష్మీపతి రాజా లాంటి సీనియర్లకు షోకాజ్ నోటీసులు జారీ అవ్వటం సస్పెండ్ అవ్వటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 40 ఏళ్ళుగా పార్టీలోనే ఉన్న లక్ష్మీపతి లాంటి వాళ్ళు సస్పెండ్ అవ్వటమే విచిత్రం. అలాగే మరికొందరికి షోకాజ్ నోటీసులు అందాయి. ఎందుకంటే కన్నా లైనులో కాకుండా వాళ్ళంతా పార్టీ లైనును వినిపించటమే కారణమని తెలిసింది. పార్టీ నుండి షోకాజ్ నోటీసులు అందుకోవటమన్నా సస్పెండ్ అవ్వటమన్నా సీనియర్లకు అవమానం కిందే లెక్క. అటువంటి వాళ్ళంతా అధ్యక్షుడిగా కన్నాను తీసేశారని తెలియగానే పిచ్చ హ్యాపీగా ఫీలయ్యారట. అంటే ఒరిజినల్ బిజెపి నేతల్లో కన్నా అండ్ కో పై ఏ స్ధాయిలో మంట ఉందో ఇపుడు అందరికీ అర్ధమైపోతోంది.
నిజానికి కన్నా అధ్యక్షుడు అయినపుడు వ్యక్తిగతంగా చంద్రబాబు అండ్ కో కు పూర్తి వ్యతిరేకమేనట. అయితే కొంతకాలం గడచిన తర్వాతే కన్నా వ్యవహార శైలిలో మార్పులు వచ్చినట్లు చెబుతున్నారు. అదికూడా ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి సావాసంతోనే కన్నా వ్యవహారశైలిలో మార్పులు వచ్చినట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. పార్టీ లైన్ను కాదని చంద్రబాబుకు అనుకూల లైన్ తీసుకోవటమే కన్నా చేసిన పెద్ద తప్పట. ఇదే విషయమై అగ్ర నాయకత్వం హెచ్చరించినా తన పంథ మార్చుకోకపోవటంతోనే చివరకు కన్నాపై వేటు వేసిందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదేమైనా రాజధాని తరలింపు, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశాలపై ఎవరూ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల్లోనే ఏకంగా అధ్యక్షుడినే మార్చేయటం చంద్రబాబు అండ్ కో కు ఊహించని దెబ్బనే చెప్పాలి.