అవును రాష్ట్ర రాజకీయాలన్నీ రివర్సులో మొదలయ్యాయి. నిన్నటి వరకూ చంద్రబాబునాయుడు జేబులో మనిషిగా ప్రచారంలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా రివర్స్ గేరు వేశాడు. రాజధానిగా అమరావతినే కంటిన్యు చేయాలనే డిమాండ్ తో రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాలోని వైసిపి, టిడిపి ఎంఎల్ఏలు వెంటనే రాజీనామాలు చేయాలని పవన్ డిమాండ్ మొదలుపెట్టాడు. రెండు జిల్లాల ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలని పవన్ చేసిన డిమాండ్ సూటిగా చంద్రబాబుకే తగులుతోంది. కాబట్టి చంద్రబాబుపై పవన్ ఒత్తిడి మొదలైనట్లే అనుకోవాలి. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ఎంఎల్ఏలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని పవన్ ఉద్దేశ్యమై ఉండవచ్చు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికార వైసిపి ఎంఎల్ఏలు ఎలాగూ రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక మిగిలింది ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ఎంఎల్ఏలు మాత్రమే. రెండు జిల్లాల్లోను మొన్నటి ఎన్నికల్లో టిడిపి తరపున చెరో ఇద్దరు ఎంఎల్ఏలుగా గెలిచారు. వారిలో వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ పార్టీకి ఇప్పటికే దూరమైపోయారు. వాళ్ళిద్దరూ మూడు రాజధానులకు మద్దతుగానే మాట్లాడుతున్నారు. అంటే రెండు జిల్లాల్లోను టిడిపికి మిగిలిన ఎంఎల్ఏలు అనగానిసత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ మాత్రమే. వీళ్ళల్లో కూడా అనగాని వైసిపిలోకి మారిపోతున్నాడనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. కాబట్టి అనగాని రాజీనామా డౌటే కాబట్టి ఇక మిగిలింది గద్దె మాత్రమే.
అంటే పవన్ డిమాండ్ ప్రకారం గద్దె మరి రాజీనామాకు సిద్ధమేనా ? గద్దె గనుక రాజీనామా చేస్తే వెంటనే స్పీకర్ ఆమోదించేస్తాడనటంలో సందేహంలేదు. కాబట్టి కరోనా వైరస్ సమస్య తర్వాత ఉప ఎన్నికలు వస్తాయేమో చూడాలి. పవన్ డిమాండ్ సరే మరి చంద్రబాబు ఏమంటాడు ? ఉప ఎన్నికలు వస్తే గద్దెను గెలిపించుకునే సత్తా ఉందా ? మూడు రాజధానులకు నిరసనగా గద్దె రాజీనామా చేస్తే మరి ఇదే డిమాండ్ ఉత్తరాంధ్రలోని ఎంఎల్ఏలకు వర్తించదా ? వైజాగ్ ను రాజధానిగా వద్దని విశాఖనగరంలో గెలిచిన నలుగురు ఎంఎల్ఏలు కూడా రాజీనామాలు చేయాలి కదా ? చేస్తారా ? తనది కాకపోతే కాశీదాక దేకమన్నాడట వెనకటికి ఎవడో అలాగే ఉంది పవన్ కల్యాణ్ డిమాండ్. తన పార్టీ తరపున గెలిచింది రాజోలులో ఒకే ఎంఎల్ఏ. ఆ ఎంఎల్ఏ కూడా పార్టీలో ఉన్నాడో లేదో పవన్ కే తెలీదు.
ఇలాంటి పరిస్దితుల్లో టిడిపి ఎంఎల్ఏలను రాజీనామా చేయాలని పవన్ అడగటమంటే చంద్రబాబుపై ఒత్తిడి పెంచటమే. ఒక వేళ పొరబాటున చంద్రబాబు తన ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయిస్తే, ఉపఎన్నికల్లో వాటన్నింటినీ మళ్ళీ టిడిపి గెలుచుకోవాల్సుంటుంది. వాటిల్లో ఏ ఒక్కటి ఓడిపోయినా చంద్రబాబుకు అవమానమే. అదే అన్నింటిలోను ఓడిపోతే ఇక నోరెత్తే అవకాశం చంద్రబాబు, పవన్, సిపిఐ కార్యదర్శి రామకృష్ణతో పాటు ఎల్లోమీడియాకు కూడా ఉండదు. మరపుడు నోరు మూసుకుని కూర్చుంటారా ? డౌటనుమానమే. ఎందుకంటే జగన్ మీద వీళ్ళకు కసి ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. కాకపోతే ఏ కోణంలో చూసినా బాగా దెబ్బ పడేది చంద్రబాబు మీదే అనటంలో సందేహం లేదు.