
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ’లేస్తే మనిషిని కాను’ అని వెనకటికొకడు అందరినీ బెదిరించేవాడట. అలాగే ఉంది చంద్రబాబు బెదిరింపులు కూడా. 151 సీట్ల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్షహోదా ఎప్పుడు ఊడిపోతుందో కూడా తెలీని అత్యంత బలహీనమైన స్ధితిలో ఉన్న చంద్రబాబునాయుడు బెదిరించటమే విచిత్రంగా ఉంది. ఫిరాయింపుల విషయంలో జగన్ ఏదో ఓ పద్దతంటు పెట్టుకున్నాడు కాబట్టి చంద్రబాబుకు అదృష్టం కలిసొచ్చింది. లేకపోతే అసెంబ్లీలో టిడిపి దుకాణం దాదాపు మూతపడిపోయేదే. అయితే వాస్తవాన్ని గ్రహించకుండా తానేదో అత్యంత బలవంతుడనని, జగన్ అధికారంలో ఉండటం కేవలం తన బిక్షే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నపుడు విభేదించిన ప్రతిపక్షం నిరసనగా జనాల్లోకి వెళ్ళటం సహజమే. ఇపుడు జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో టిడిపి విభేదిస్తోంది. కాబట్టి జనాల్లోకి వెళ్ళాల్సిన బాధ్యత టిడిపిపైనే ఉంటుంది. అయితే చంద్రబాబు మాత్రం రివర్సులో వైసిపి ఎంఎల్ఏలను రాజీనామా చేయాలని, అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేయటం అందుకు 48 గంటలు డెడ్ లైన్ విధించటమే విడ్డూరం. సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణా సెంటిమెంటు ఉందని నిరూపించాలని అనుకున్నపుడు కేసీయార్, టిఆర్ఎస్ ఎంఎల్ఏలే రాజీనామాలు చేశారు. అలాగే మూడు రాజధానులకు జనాలందరూ వ్యతిరేకం కాబట్టి అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయటంలో అర్ధమేలేదు. అసలు మూడు రాజధానులకు 5 కోట్లమంది జనాలు వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు ఎలా చెప్పగలుగుతున్నాడు ? చంద్రబాబు ఏమన్నా సర్వే చేయించాడా ? లేకపోతే సీమాంధ్ర, ఉత్తరాంధ్ర జనాలేమన్నా జగన్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు మొదలుపెట్టారా ? ఏమీ లేదే.
అసలు వైసిపి ఎంఎల్ఏలను రాజీనామాలు చేయాలని అడిగే బదులు తన పార్టీ ఎంఎల్ఏలతో ముందు చంద్రబాబు రాజీనామాలు చేయించవచ్చు కదా. ఆపని ఎందుకు చేయటం లేదు. ఎందుకంటే రాజీనామాలు చేయమంటే ఎంతమంది చేస్తారో చంద్రబాబుకే డౌటనుమానం కాబట్టి. మొన్న గెలిచిన 23 మంది ఎంఎల్ఏల్లో పార్టీలో ఎంతమందున్నారు ? ఎంతమంది బయటకు వచ్చేయటానికి రెడీగా ఉన్నారు ? తనతో మిగిలేదెందరు ? అనే విషయంలో చంద్రబాబుకే క్లారిటి లేదు. వైజాగ్ రాజధానిగా వద్దంటూ నిరసనగా రాజీనామా చేసిన తర్వాత నలుగురు టిడిపి ఎంఎల్ఏలు మళ్ళీ అక్కడ గెలుస్తారా ? అందుకనే వైజాగ్ సిటిలో గెలిచిన నలుగురు టిడిపి ఎంఎల్ఏలు చంద్రబాబుకు మద్దతుగా ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. పైగా తమ ఫోన్లతో పాటు పిఏల ఫోన్లు కూడా స్విచ్చాఫ్ చేసుకున్నారట.
ఇక ’కమ్మోరి గేటెడ్ కమ్యూనిటి’ గా ముద్రపడిన అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయటం కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర జనాలు ఎందుకు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తారు ? చంద్రబాబు పిలుపుతో టిడిపి నేతలే రోడ్లపైకి రానపుడు జనాలెందుకు వస్తారు. చంద్రబాబు డెడ్ లైన్ను మంత్రులు, వైసిపి నేతలు జోక్ కింద కొట్టిపాడేశారు. కాబట్టి వైసిపి ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటం, అసెంబ్లీ రద్దు అన్నది జరిగే పనికాదని తేలిపోయింది. మరి 48 గంటల తర్వాత చంద్రబాబు ఏమి చేయబోతున్నాడు ? ఏదో ఫ్లోలో అనేశాడు కానీ తర్వాతేం చేయాలో బహుశా చంద్రబాబుకు కూడా తెలీదేమో.
డెడ్ లైన్ పెట్టేశాడు కాబట్టి 48 గంటల తర్వాత ఏదో ఒకటి చేయాల్సిన అవసరం చంద్రబాబుకుంది. ఇపుడిదే అంశంపై రాజకీయపార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనాల్లో కూడా ఉత్కంఠ పెరిగిపోతోంది. మరి ఏమి చేస్తాడు ? అసలు చేయటానికి చంద్రబాబు దగ్గరేముంది ? ఏముందంటే మళ్ళీ మరో డెడ్ లైన్ పెడతాడు. లేకపోతే అసలు తాను డెడ్ లైన్ పెట్టిన విషయాన్ని మరచిపోయినట్లు డ్రామాలాడుతాడు. ఇంతకు మించి చంద్రబాబు చేయగలిగింది కూడా ఏమీలేదుమరి. ఎందుకంటే రాజీనామాల విషయంలో చంద్రబాబు చెప్పినట్లు టిడిపి ఎంఎల్ఏలే అందరు వింటారనే నమ్మకం లేదు కాబట్టి. మొత్తానికి చంద్రబాబు 48 గంటల డెడ్ లైన్ పెద్ద జోక్ గా మారిపోతుందేమో చూడాలి.