అవును ఫొటోలో మీరు చూస్తున్నది, చంద్రబాబునాయుడు చెబుతున్నది నిజమే అయితే తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు ధైర్యంగా రాజీనామాలు చేసేయొచ్చు. ’ఏపి విత్ అమరావతి’ అనే ఒక వెబ్ సైట్ ను తెలుగుదేశంపార్టీ వారం రోజుల క్రితం ప్రారంభించింది. వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు చెప్పగానే దాని విశ్వసనీయత ఏమిటో అందరికీ అర్ధమైపోయింది. అమరావతినే రాజధానిగా కంటిన్యు చేయాలనే చంద్రబాబు డిమాండ్ కు తగ్గట్లుగానే వెబ్ సైట్ ను కూడా పార్టీ డిజైన్ చేసింది. లేకపోతే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అమరావతిని మాత్రమే రాజధానిగా ఉండాలని అనుకుంటున్నారా ? అంటూ ఓ ప్రశ్న వేశారు వెబ్ సైట్లో. అసలు ఈ ప్రశ్న ఒక్కదాన్ని ఉంచటంలోనే సమస్యంతా మొదలైంది.
ప్రజాభిప్రాయ సేకరణలో చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపైన కూడా జనాభిప్రాయం చెప్పమని ఎందుకు అడగలేదు ? ఇక జనాభిప్రాయ సేకరణలో అంటే టీవీల్లో చెప్పే సమాధానాల్లో ఎల్లోమీడియా జనాలు, టిడిపి జనాలు అనుకూలంగా మలుచుకోవటంలో ఎంతటి ఘనులో అందరికీ తెలిసిందే. ఒకే అబద్ధాన్ని ఒకటికి వందసార్లు చెప్పిందే చెప్పి జనాలను టిడిపి నేతలు ఎంతగా అయోమయానికి గురిచేస్తున్నారో అందరు చూస్తున్నదే. అటువంటి పచ్చపార్టీ చేసే అమరావతి అంశంపై ప్రజాభిప్రాయసేకరణ నిష్పక్షపాతంగా ఉంటుందని ఎవరు నమ్మటం లేదు. ఈ నేపధ్యంలోనే ఏవి విత్ అమరావతి అనే వెబ్ సైట్ లో ఫలితాలు కూడా ఇటువంటి అనుమానాలను పెంచేస్తోంది.
వెబ్ సైట్లో చెప్పిన ప్రకారం 3,85,254 మంది అమరావతి అంశంపై ఓటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. వీరిలో 94 శాతం మంది అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నట్లు కూడా వెబ్ సైట్లో నిర్వాహకులు చెప్పారు. మరి ఇదే నిజమైతే ఇదే అంశం ఆధారంగా టిడిపి ఎంఎల్ఏలు అందరు రాజీనామాలు చేసేస్తారా ? రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల జనాల్లో అమరావతి ఫీలింగ్ అంత బలంగా ఉన్నపుడు తన ఎంఎల్ఏలందరితో రాజీనామాలు చేయించి చంద్రబాబు మధ్యంతర ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా ? మధ్యంతర ఎన్నికల్లో పోటిచేసి మళ్ళీ అన్నీ స్ధానాలను టిడిపి గెలుచుకుంటే అప్పుడు వెబ్ సైట్ లో ఫలితం నిజమే అని జనాలందరు నమ్ముతారు. అప్పుడే అమరావతి రాజధానిపై జనాల్లో ఎంతటి బలమైన సెంటిమెంటు ఉందో జగన్ కూడా అర్ధమవుతుంది.
ఓటింగ్ లో పాల్గొన్న 3.84 లక్షల మందిలో 94 శాతం మంది అమరావతినే రాజధానిగా ఉండాలని కోరుకోవటమంటే మామూలు విషయం కాదు. అంటే ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళంతా ఏ ప్రాంతం వాళ్ళు, అందులో 94 శాతంమంది ఎక్కడి వాళ్ళో వెబ్ సైట్ చెప్పలేదు లేండి. అందుకనే ఓటింగ్ లో పాల్గొన్న వాళ్ళు, 94 శాతం మంది బహుశా అమరావతి ప్రాంతం వాళ్ళేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎక్కడో ఉత్తరాంధ్ర, ఇంకెక్కడో ఉన్న రాయలసీమ జనాలు అమరావతికి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం లేదన్నది వాస్తవం. పోలైన ఓట్లలో ఏ ప్రాంతం నుండి ఎన్ని ఓట్లొచ్చాయనే విషయాన్ని చెప్పకపోవటంతోనే వెబ్ సైట్ పై అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరే కాసేపు ఇది నిజమే అని అనుకున్నా మరి వెంటనే ఎంఎల్ఏలతో చంద్రబాబు రాజీనామాలు చేయించచ్చు. జనాలందరూ చంద్రబాబు డిమాండ్ కే మద్దతుగా నిలబడుతున్నపుడు రాజీనామాలకు ఎందుకు వెనకాడుతున్నట్లు ?