రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా బాగా తెలివి మీరిపోయినట్లే ఉన్నాడు. ఎన్నికల కమీషన్ కార్యాలయం విధుల్లో సిఐడి అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, స్వతంత్రను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నట్లు నిమ్మగడ్డ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. కమీషన్ సిబ్బందిపై సిఐడి చేస్తున్న విచారణను నిలిపేయాలని అడుగుతునే, సిఐడి వ్యవహారాలపై సిబిఐ విచారణను కోరటం నిమ్మగడ్డకే చెల్లింది. అప్పటికి నిమ్మగడ్డ లెక్క ప్రకారం ఎన్నికల కమీషన్ అంటే ఏపి ప్రభుత్వంలో భాగం కాదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమీషన్ అంటే స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్ధ కాబట్టి ప్రభుత్వ జోక్యం కుదరదని నిమ్మగడ్డ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల కమీషనర్ తో పాటు సిబ్బందిని నియమించేది ప్రభుత్వమే. వాళ్ళకి జీతబత్యాలు చెల్లించేది ప్రభుత్వమే. కానీ ఎన్నికల కమీషన్ అంటే ప్రభుత్వానికి అతీతమన్నట్లుగా నిమ్మగడ్డ మాట్లాడుతున్నాడు. ఈ మేరకు కోర్టులో కేసు కూడా వేశాడు.
స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తు నిమ్మగడ్డ ప్రకటన చేసిన దగ్గర నుండి జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ వివాదాస్పదమైన నేపధ్యంలోనే నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖ కార్యాలయానికి ప్రభుత్వంపై పెద్ద ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులో ప్రభుత్వం పరువును సాంతం తీసేసే విధంగా అనేక ఆరోపణలు గుప్పించారు. ఈ విషయం బయటపడగానే పెద్ద సంచలనమే రేగింది. దానిపై మీడియా ప్రస్తావించినపుడు ఆ లేఖతో తనకు సంబంధం లేదని స్వయంగా నిమ్మగడ్డే చెప్పాడు. దాంతో వివాదం మరింతగా పెరిగిపోయింది. ఇందుకనే నిమ్మగడ్డ పేరుతో కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖపై విచారణ జరపాలంటూ డిజిపి గౌతమ్ సవాంగ్ కు రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశాడు. డిజిపి ఆదేశాల ప్రకారం సిఐడి రంగంలోకి దిగింది.
విజయసాయి ఆరోపణల ప్రకారం హోంశాఖ కార్యాలయానికి వెళ్ళిన లేఖ మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో తయారైందట. లేఖను పార్టీ కార్యాలయంలో తయారుచేసిన టిడిపి నేతలే నిమ్మగడ్డ సంతకాన్ని పోర్జరీ చేసేశారట. అందుకనే ఆ లేఖతో తనకు సంబంధం లేదని నిమ్మగడ్డ ప్రకటించాడు. అంటే ఎక్కడో తయారైన లేఖను నిమ్మగడ్డ తన ఆఫీసు నుండే కేంద్ర హోంశాఖకు మెయిల్ లో వెళ్ళింది. ఇంత ఘంటా పథంగా విజయసాయి ఆరోపణలు చేశాడంటే బహుశా ఆయన దగ్గర ఏదో బలమైన ఆధారాలు ఉండే ఉంటాయనుకోవాలి. ఆ ఆధారాలతో సహా ఎంపి ఫిర్యాదు చేశాడట. ఎప్పుడైతే ఎంపి ఫిర్యాదు తో సిఐడి విచారణ మొదలైందని తెలిసిందే వెంటనే నిమ్మగడ్డ స్పందించాడు. కేంద్ర హోంశాఖకు వెళ్ళిన లేఖను తానే రాసినట్లు తనంతట తానుగా ప్రకటించటంతో అందరు ఆశ్చర్యపోయారు.
సరే విచారణ అంటూ మొదలైన తర్వాత అధికారులు కమీషన్ కార్యాలయంలోని కొందరు సిబ్బందిని విచారించారు. తమ విచారణలో భాగంగా అప్పట్లో నిమ్మగడ్డతో పాటు ఆయన పిఏ ఉపయోగించిన కంప్యూటర్లు+హార్డు డ్రైవులను కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయమై ఇపుడు నిమ్మగడ్డ కోర్టులో పిటీషన్ వేశాడు. తమ కార్యాలయంపై సిఐడి చేస్తున్న విచారణను నిలిపేయాలంటూ కోర్టులో నిమ్మగడ్డ కేసు వేశాడు. అయితే సిఐడి చేస్తున్న విచారణ నిలిపేయాలని ఒకవైపు అడుగుతునే మరోవైపు సిఐడి విచారణపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి ఎల్లోబ్యాచ్ తో కలిసిన తర్వాత నిమ్మగడ్డ కూడా బాగా తెలివి మీరిపోయినట్లే కనిపిస్తోంది. లేఖ విషయంలో తాను ఎక్కడ తగులుకుంటానో అనే భయం నిమ్మగడ్డను వెంటాడుతున్నట్లుంది. అందుకనే విచారణను అడ్డుకుంటూ కోర్టులో కేసు వేశాడని అర్ధమైపోతోంది.