ప్రజల సంగతిని పక్కనపెట్టేసినా పార్టీ కార్యకర్తలకు మనం ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామో కాస్త ఆలోచించమని గట్టిగానే చెప్పాడట. ఎప్పుడో ఒకసారి చుట్టపుచూపుగా వచ్చేట్లయితే పార్టీని బతికించలేరంటూ తాను చెప్పదలచుకున్నది అయ్యన్న స్పష్టంగానే చెప్పేశాడట. ప్రజల్లోకి వెళ్ళకుండా ఎంతసేపు ఆన్ లైన్ లో మీడియా సమావేశాలు, జూమ్ లో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకుంటూ కూర్చుని సరిపెడితే పార్టీకి ఇక భవిష్యత్తుండదని ఘాటుగానే హెచ్చరించాడట. అలాగే కేవలం ప్రచారం కోసమే కొందరు పనిచేస్తున్నారంటూ పరోక్షంగా చాలామంది నేతలపై విసుర్లు విసిరాడట అయ్యన్న. బహుశా మాజీ మంత్రులు దేవినేని, నిమ్మకాలయ లాంటి వాళ్ళనో లేకపోతే సీనియర్ నేత వర్ల రామయ్య లాంటి వాళ్ళనో పరోక్షంగా ఆక్షేపించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
నిజానికి మొదటినుండి అయ్యన్నపాత్రుడు తీరే అంత. తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చంద్రబాబు మోహం మీదే అందరి ముందే చెప్పేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా అయ్యన్న తప్పు పట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత లేనపుడు టిడిపి ఎంతగా ఆందోళనలు చేసినా ఉపయోగం ఉండదని అందరి ముందు సమావేశంలోనే సూటిగా చెప్పేశాడట. చింతకాయల చెప్పే మాటలు చాలావరకు చంద్రబాబుకు రుచించవు. ఎందుకంటే చింతకాయల స్వతంత్రంగా పనిచేయటానికి ఇష్టపడతాడు. తన సహచరుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో వివాదాలు తలెత్తినపుడు కాస్త తగ్గమని చంద్రబాబు చెప్పినా అయ్యన్న పట్టంచుకోలేదు.
పార్టీ పరిస్ధితి గురించి, చంద్రబాబు తీరు గురించి చింతకాయల చెప్పినదాంట్లో తప్పేమీలేదు. చింతకాయల చెప్పిన మాటలే చాలామంది నేతల మనస్సుల్లో కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. కరోనా వైరస్ పేరు చెప్పేసి చాలామంది సీనియర్ నేతలు తమ ఇళ్ళల్లో నుండి కదలటం లేదు. జగన్ ప్రభుత్వంపై ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఇప్పటికి చాలాసార్లు పిలుపిచ్చాడు. అయితే చంద్రబాబు ఎన్నిసార్లు పిలుపిచ్చినా నేతలెవరు పట్టించుకోలేదు. ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చుని జూమ్ కాన్ఫరెన్సులోనే తమ మద్దతుదారులతో మాట్లాడి, కార్యకర్తలతో మొబైల్ వీడియో కాన్ఫరెన్సులతో మాట్లాడి మమ అనిపించారు. దీన్నే జూమ్ అప్లికేషన్ లో ప్రభుత్వంపై ఉద్యమం, ఆందోళన చేయటం దేశంలోనే వినూత్నమమని విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. ఇటువంటి విషయాలనే చింతకాయల ప్రస్తావించి చంద్రబాబును దులిపేసినట్లు సమాచారం. మరి చంద్రబాబు ఏమి చేస్తాడో చూడాలి.