నరసాపురం వైసిపి ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాటలు మామూలుగా లేవు. రాజీనామా చేయకుండానే, ఉపఎన్నికలు రాకుండానే తాను లక్ష ఓట్ల మెజారిటితో గెలుస్తానని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నరసాపురంలో ఉపఎన్నికంటూ వస్తే తనకు లక్ష ఓట్ల మెజారిటి తక్కువ రాదన్నట్లుగా మాట్లాడాడు. మరి తన గెలుపు, మెజారిటిపై అంతటి నమ్మకమే ఉంటే వెంటనే రాజీనామా చేసి వైసిపి మొహాన కొట్టొచ్చు కదా. రాజీనామా చేయమని పదే పదే వైసిపి నేతలతో అడిగించుకోవాల్సిన ఖర్మ ఏమిపట్టింది ఎంపికి. మొన్నటి ఎన్నికల్లో ఎంపిగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో చెడింది. కారణాలు స్పష్టంగా తెలీదుకానీ ఇద్దరి మధ్య గ్యాప్ మాత్రం పెరిగిపోయిందన్నది వాస్తవం. దాంతో పార్టీమొత్తం కృష్ణంరాజుపై కత్తి కట్టింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపి కూడా జగన్ ను నేరుగా ఏమీ అనకుండానే ప్రభుత్వాన్ని పార్టీని జనాల్లో గబ్బు పట్టించేందుకు వీలైనంతగా కష్టపడుతున్నాడు.  అందుకు అవకాశం ఉన్న ఏ చిన్న ఘటనను కూడా వదులుకోవటం లేదు. పనిలో పనిగా ఢిల్లీలో బిజెపి పెద్దలతో లాబీయింగ్ చేసుకుంటునే రాష్ట్రంలో ప్రతిపక్షాలకు దగ్గరగా మెలుగుతున్నాడు. ఇదే సమయంలో జగన్ను తీవ్రంగా వ్యతిరేకించే మీడియాతో కూడా సన్నిహిత సంబంధాలు కంటిన్యు చేస్తున్నాడు. ఎంపి ఇదంతా కావాలనే చేస్తున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పై క్రిస్తియన్ అనే ముద్రవేసి హిందువులకు దూరం చేసే ప్రయత్నాలు కూడా జోరుగానే చేస్తున్నాడు. అందుకనే ఈమధ్యనే తగలబడిన అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం ఆలయం రథం ఘటనలో కూడా మతపరమైన కుట్ర ఉందంటు పదే పదే ఆరోపణలు చేశాడు.




సరే ఈ గొడవలు ఇలాగుండగానే హఠాత్తుగా తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించటం గమనార్హం. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసిపి తరపున ఎంపిగా కృష్ణంరాజు కాకుండా ఇంకెవరైనా పోటి చేసుంటే ఇంతకన్నా మంచి మెజారిటినే వచ్చుండేదని పార్టీలో చర్చ జరుగుతోంది. చివరి నిముషంలో పార్టీలో చేరిన కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వటమే జగన్ చేసిన తప్పు. అయితే ఎందుకిచ్చిడంటే అప్పటి పరిస్ధితులు+ఎంఎల్ఏ అభ్యర్ధులు కూడా పట్టుబట్టడంతో ఈయనకు టికెట్ ఇవ్వక జగన్ కు తప్పలేదు. దాంతో తన వల్లే వైసిపి నరసాపురంలో గెలిచిందని ఎంపి విచిత్రమైన వాదన వినిపిస్తున్నాడు. తనను పార్టీలో చేరి పోటి చేయమని జగన్ బతిమలాడటం వల్లే వైసిపిలో చేరానంటు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది.





నిజానికి కృష్ణంరాజును బతిమలాడి పార్టీలో చేర్చుకుని, టికెట్ ఇచ్చి పోటి చేయించాల్సిన అవసరమైతే జగన్ కు లేదు. ఎంపిగా పోటి చేసేందుకు గట్టి నేతలు చాలామందే ఉన్నారు. వాస్తవం ఇదైతే ఎంపి మాత్రం తన డప్పు తానే కొట్టుకుంటున్నాడు. మొన్నటి ఎన్నికల్లో ఎంపికి వచ్చింది కేవలం 30 వేల మెజారిటి మాత్రమే.  గెలిచిన ఎంపికి వచ్చిన మొత్తం ఓట్లకన్నా 2014లో ఓడిపోయిన వైసిపి అభ్యర్ధికి వచ్చిన ఓట్లే ఎక్కువ. నిజంగా తనకు లక్ష ఓట్ల మెజారిటి రావటమే నిజమైతే మరి వెంటనే ఎందుకు రాజీనామా చేయకూడదు ? రాజీనామా చేయటానికి ఎందుకు భయపడుతున్నాడు ? పైగా తన రాజీనామాను అమరావతికి రెఫరెండంగా అంగీకరిస్తారా ? అనే పిచ్చి ప్రశ్నొకటి వేస్తున్నాడు. అంటే కృష్ణంరాజుకు రాజీనామా చేసే ఆలోచన లేదని తేలిపోతోంది. మరి ఇంకెందుకు ఇటువంటి పిచ్చిమాటలు ?

మరింత సమాచారం తెలుసుకోండి: