తెలుగుదేశంపార్టీలో తిరుగుబాటు ఎంఎల్ఏ వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి ఎన్నికల్లో గన్నవరం నుండి టిడిపి ఎంఎల్ఏగా గెలిచిన వంశీకి తర్వాత కాలంలో చంద్రబాబునాయుడితో చెడింది. దాంతో పార్టీలో తిరుగుబాటు జెండా ఎగరేశాడు. వెంటనే ఎంఎల్ఏకి షోకాజ్ నోటీసిచ్చిన పార్టీ నాయకత్వం సస్పెండ్ కూడా చేసింది. అప్పటి నుండి చద్రబాబంటే ఎంఎల్ఏ ఒంటికాలిపై లేస్తున్నారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తొందరలో రాష్ట్రంలో బిజెపినే ప్రతిపక్షమవుతుందని చెప్పటం సంచలనంగా మారింది. టిడిపి ముణిగిపోయే పడవని కాబట్టి అందులో ఉండాలని ఎవరు కోరుకుంటారంటూ మీడియానే ఎదురు ప్రశ్నించాడు వంశీ.
ఎన్టీయార్ టిడిపిని స్ధాపిస్తే చంద్రబాబు భూస్ధాపితం చేసేయటం ఖాయమని కూడా ఎంఎల్ఏ జోస్యం చెప్పాడు. ఎన్టీయార్ టిడిపికి వ్యవస్ధాపక అధ్యక్షుడైతే చంద్రబాబు అదే పార్టీకి భూస్ధాపక అధ్యక్షుడైపోతాడంటు ఎద్దేవా చేశాడు. పార్టీ ఘనమంతా చరిత్రగా మిగిలిపోతుందని, ఇక భవిష్యత్తు లేని పార్టీగా టిడిపి మిగిలిపోతుందన్నాడు. వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరటం మంచి పరిణామంగా వంశీ అభివర్ణించాడు. వాసుపల్లే కాదు ఇంకా చాలామంది నేతలు వైసిపిలో చేరటానికి రెడీగా ఉన్నారంటూ పెద్ద బాంబే పేల్చాడు.
నిజానికి టిడిపి ఎంఎల్ఏలను చేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే కనీసం 10 మంది టిడిపికి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నారంటూ వల్లభనేని చెప్పటం రాజకీయంగా కాక రేపుతోంది. చంద్రబాబు హయాంలోనే పార్టీ మూతపడిపోవటం ఖాయమని తర్వాత నారా లోకేష్ పాలు, పెరుగు అమ్ముకోవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ట్విట్టర్ వేదికగా తమపై ఆరోపణలు చేయటానికి తప్ప లోకేష్ ఇంకెందుకు పనికిరాడని కూడా వంశీ తేల్చేశాడు. మాజీ మంత్రి దేవినేని ఉమ విషయమై స్పందిస్తు మాట్లాడుదామని ఫోన్ చేసినా మాట్లాడే ధైర్యం లేని ఉమ తమను ఏమి చేయగలడంటూ గాలి తీసేశాడు.
ఇదే సమయంలో తొందరలోనే బిజెపి ప్రతిపక్షమవ్వబోతోందంటూ జోస్యం చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే టిడిపికి 23 మంది ఎంఎల్ఏలున్నారు. సరే ఇందులో నలుగురు తిరుగుబాటు చేసినా వాళ్ళంతా ఇప్పటికీ టిడిపి సభ్యులే. ఇదే సమయంలో బిజెపికి ఒక్క ఎంఎల్ఏ కూడా లేరన్న విషయం తెలిసిందే. 23 మంది ఎంఎల్ఏలున్న టిడిపిని కాదని ఒక్క ఎంఎల్ఏ కూడా లేని బిజెపి ఎలా ప్రతిపక్షమవుతుంది ? ప్రతిపక్షాలంటే బిజెపితో పాటు కాంగ్రెస్, వామపక్షాలు, జనేసేన కూడా ఉన్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్షమంటే మాత్రం టిడిపినే. ఈ విషయం వంశీకి తెలీకుండానే కామెంట్ చేశారా ? ఏమో ఎంఎల్ఏ మనసులో ఏముందో ఎవరికి తెలుసు ?