
డిక్లరేషన్..డిక్లరేషన్ అంటూ ప్రతిపక్షాలు ముఖ్యంగా టిడిపి, బిజెపిలు ఒకటే గోల చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చి పట్టువస్త్రాలు ఇచ్చే విషయాన్ని చంద్రబాబు, బిజెపి+ఎల్లోమీడియా ఎంతగా రచ్చ చేయాలో అంతా చేశాయి. సరే వీళ్ళు చేసిన గోలను జనాలు అసలు ఏమాత్రం పట్టించుకోలేదనుకోండి అదివేరే సంగతి. అందుకనే పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం అయిపోగానే పాల పొంగు చల్లారిపోయినట్లగా వీళ్ళ డిమాండ్లు మళ్ళీ వినబడలేదు. చిన్న చిన్న విషయాలను పట్టుకుని వీళ్ళు చేస్తున్న గోలను చూస్తుంటే అసలు వీళ్ళకు ప్రజా స్వామ్యంపైన, ప్రజా సమస్యలపైన అవగాహన ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సమాజానికి ఏమాత్రం అవసరం లేని, ప్రజలకు ఎవరికీ పట్టని అంశాలను పట్టుకుని రోజుల తరబడి ఊగలాడటం వీళ్ళకే చెల్లింది.
ఇక్కడ డిక్లరేషన్ అంశం అన్నది చాలా చిన్న విషయం. అసలు విషయం ఏమిటంటే జగన్ పై బురద చల్లటం. జగన్ పై బురద చల్లటానికి చంద్రబాబు, ప్రతిపక్షాలు ఎంతకన్నా దిగజారిపోతాయన్న విషయం మరోసారి నిరూపణయ్యింది. వీళ్ళకు ఎలాగూ ఎల్లోమీడియా మద్దతుంది కాబట్టి వీళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలంటే ప్రజా సమస్యలు చాలానే ఉంటాయి. అయితే వాటినన్నింటిని వదిలిపెట్టేసి పనికిమాలిన డిక్లరేషన్ అంశాన్ని రోజుల తరబడి సాగదీస్తున్నారంటేనే వీళ్ళల్లో సత్తా లేదని అర్ధమైపోతోంది. ప్రజా సమస్యలు ఏవీ లేవు కాబట్టే వీళ్ళు డిక్లరేషన్ అంశాన్ని పట్టుకుని ఊగుతున్నారు.
అసలు వీళ్ళంతా మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే మొన్నటి ఎన్నికల్లో కోట్లాదిమంది జనాలు జగన్ కు అనుకూలంగా డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని. ప్రజలిచ్చిన అసలైన డిక్లరేషన్ తోనే జగన్ తిరుమల ఆలయంలోకి ప్రవేశించాడు. రెండుసార్లు బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని మరచిపోయి చంద్రబాబు, బిజెపి, ఎల్లోమీడియా ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా జనాలు పట్టించుకోరు. జగన్ కు వ్యతిరేకంగా ఇపుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ జనాలకు తెలిసే కదా వైసిపిని బంపర్ మెజారిటితో గెలిపించింది. మళ్ళీ వీళ్ళ గోలేంటి మధ్యలో. తమ డిక్లరేషన్ కు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నాడని జనాలు అనుకుంటే వాళ్ళే ఇచ్చిన డిక్లరేషన్ను రద్దు చేసేస్తారు.
చంద్రబాబు, బిజెపి, ఎల్లోమీడియా ఆరోపణలు, వాదనలు ఎందుకు తేలిపోయాయంటే అందులో పసలేదు కాబట్టే. ఎందుకు పసలేదంటే సంవత్సరాలుగా జగన్ తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటునే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా ఎన్నోసార్లు శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. జగన్ సిఎం అయిన మొదటి సంవత్సరం కూడా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇన్ని సంవత్సరాలుగా అడగని డిక్లరేషన్ విషయాన్ని ఇపుడే ఎందుకు అడుగుతున్నారు ? ఈ ప్రశ్నకే జగన్ ప్రత్యర్ధులు సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకనే వాళ్ళ వాదనలన్నీ వీగిపోతున్నాయి. ఎవరి వాదన ఏమిటి అనే విషయాన్ని జనాలందరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే అసలైన డిక్లరేషన్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి.