వైసీపీలో తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామ కృష్ణంరాజు కు కౌంట్ డౌన్ మొదలైనట్లే ఉంది. తాజాగా లోక్ సభ సెక్రటేరియట్ చేసిన ప్రకటన చూస్తుంటే ఈ విషయం అర్ధమైపోతోంది. లోక్ సభలో సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటి ఛైర్మన్ పదవి నుండి ఎంపిని తప్పించినట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున కృష్ణంరాజు నరసాపురం నుండి గెలిచిన విషయం తెలిసిందే. గెలిచిన కొద్దికాలం తర్వాత జగన్మోహన్ రెడ్డితో విభేదాలు మొదలయ్యాయి. దాంతో మెల్లిగా జగన్ తో పాటు పార్టీకి కూడా దూరమైపోయారు. జగన్ తో చెడిన కారణంగా స్వయంగా కృష్ణంరాజే పార్టీ నేతలకు దూరమైపోయారు. అప్పటి నుండి లోక్ సభ పరిధిలోని ఎంఎల్ఏలతో ఎంపికి బాగా చెడటంతో ఒకళ్ళమీద మరొకళ్ళు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్న విషయం తెలిసిందే.
పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేసిన ఎంపి ఊరుకోకుండా జగన్ పై నోరుపారేసుకోవటం మొదలుపెట్టారు. అయినదానికీ కానిదానికి రాష్ట్రంలో ఎక్కడ ఏచిన్న సంఘటన జరిగినా దాన్ని జగన్ కు ఆపాదించేసి నానా యాగీ చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ వ్యతిరేక మీడియాతో చేతులు కలిపారు. ప్రతిరోజు అవసరమున్నా లేకపోయినా ఎంపి జగన్ పై నో రుపారేసుకోవటం, సదరు మీడియా ఆ వ్యాఖ్యలకు బాగా ప్రచారం చేయటం మామూలైపోయింది. ఈ దశలోనే ఎంపిని భరించటం అనవసరమని భావించిన జగన్ ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాసింది.
ఇదే సందర్భంలో కమిటి ఛైర్మన్ పదవి నుండి ఎంపిని తీసేసి మచిలీపట్నం లోక్ సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరిని నియమించాలని లేఖలో కోరారు. పార్టీ తన విషయంలో స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలియగానే ఎంపి మరింత రెచ్చిపోయారు. తనను కమిటి ఛైర్మన్ గా ఎవరు పీకలేరంటూ చాలెంజ్ చేశారు. ఛైర్మన్ పదవి వైసీపీ ఎంపిగా కాకుండా సొంత ఇమేజి వల్లే వచ్చిందన్నారు. జగన్ ఎంత ప్రయత్నించినా ఛైర్మన్ గా తనను తీయించటం వల్ల కాదంటూ నోటికొచ్చింది ఏదేదో మాట్లాడారు.
సీన్ కట్ చేస్తే మొన్న వరుసగా జగన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటి అయిన విషయం అందరికీ తెలిసిందే. అనేక విషయాలు ప్రస్తావించిన జగన్ రాజకీయ డిమాండ్లు కూడా చేసినట్లు ప్రచారంలో ఉంది. ఆ డిమాండ్లలో ఎంపిపై అనర్హత వేటు కూడా కీలకమైందే. నిజానికి ఎంపిపై అనర్హత వేటు కమిటి ఛైర్మన్ గా తప్పించమని వైసీపీ స్పీకర్ కు లేఖ రాసి చాలా కాలమే అయ్యింది. అయితే ఇంతకాలం పట్టించుకోని స్పీకర్ హఠాత్తుగా కమిటి ఛైర్మన్ పదవి నుండి తప్పించారంటే ఏమిటర్ధం ? ఏమిటంటే రాజకీయ జగన్ డిమాండ్ కు ప్రధాని సానుకూలంగా స్పందించినట్లే అనుకోవాలి.
తాజాగా కమిటి ఛైర్మన్ పదవిని ఊడగొట్టారు కాబట్టి తొందరలోనే ఎంపిగా అనర్హత వేటు వేయటం కూడా ఖాయమని పార్టీలో ప్రచారం పెరిగిపోతోంది. అంటే ప్రధాని, అమిత్ షా తో జగన్ భేటి తర్వాత ఫలితాలు ఇస్తున్నట్లే అనిపిస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎంపిగా గెలిచిన తర్వాత కృష్ణంరాజు తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నట్లు అర్ధమైపోతోంది. కేవలం వైసీపీ తరపున పోటీ చేయబట్టే తాను గెలిచానన్న విషయాన్ని మరచిపోయారు. తాను అభ్యర్ధిగా పోటీ చేసిన కారణంగానే వైసీపీ గెలిచిందనే స్ధాయికి ఎంపి వెళ్ళిపోయారు. మరి ఎంపిపై అనర్హత వేటు పడిన తర్వాత ఉపఎన్నికలు జరిగితే అప్పుడు ఎవరి వల్ల ఎవరు గెలిచారనే విషయంలో క్లారిటి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.