తెలుగుదేశంపార్టీ పరిస్దితి చాలా విచిత్రంగా తయారవుతోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని తాజాగా నిర్ణయించింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధి పనబాక లక్ష్మినే మళ్ళీ బరిలోకి దింపాలని చంద్రబాబునాయుడు నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది. తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ దూరంగా ఉంటుందని ఆమధ్య చంద్రబాబే బీజేపీకి ప్రతిపాదనలు పంపినట్లు ప్రచారం జరిగింది. తాము పోటీలోకి దూరంగా ఉండి పోటీచేయబోయే బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదన సారాంశంగా ప్రచారం జరిగింది. ఉపఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయటం ఖాయంగా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి బీజేపీ పోటీ చేయటం ఖాయం. అందుకనే చంద్రబాబు కూడా ప్రతిపాదనలు పంపారని ప్రచారం జరిగింది. ఎలాగూ జనసేన మిత్రపక్షమే కాబట్టి ఎలాగూ బీజేపీకి మద్దతుగా నిలబడటం ఖాయం.




ఇటువంటి నేపధ్యంలోనే తమదే గెలుపంటూ బీజేపీ నేతలు తిరుపతిలో ఇప్పటికే హడావుడి మొదలుపెట్టేశారు.  రాష్ట్ర నేతలను వదిలేస్తే  కేంద్రం నుండి  తేపకొక నేత రావటం ఉపఎన్నికల్లో  బీజేపీదే గెలపంటు ప్రకటించేసి వెళ్ళటం అందరు చూస్తున్నదే. బీజేపీలోని మాజీమంత్రి రావెల కిషోర్ బాబు కానీ లేకపోతే బీజేపీలో చేరబోతోందనే ప్రచారంలో ఉన్న పనబాక లక్ష్మి కానీ అభ్యర్ధిగా ఉంటారంటూ విపరీతమైన ప్రచారంలో ఉంది. ఇంతలో సోమవారం తిరుపతి నియోజకవర్గంలోని నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో  పనబాక లక్ష్మినే అభ్యర్ధిగా పోటి చేస్తుందని ప్రకటించటంతో అందరు ఆశ్చర్యపోయారు.  అభ్యర్ధి ఎంపిక విషయంలో ఇప్పటివరకు చంద్రబాబు నేతలతో సమావేశం కూడా పెట్టలేదు. అలాంటిది ఏకంగా అభ్యర్ధినే ప్రకటించేయటం విచిత్రంగా ఉంది.




ఇపుడు పనబాక లక్ష్మిని అభ్యర్ధిగా ప్రకటించారంటే బీజేపీకి మద్దుతు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రతిపాదన తప్పా ? అనే అనుమానం వస్తోంది. లేకపోతే చంద్రబాబు చేసిన ప్రతిపాదనను బీజేపీ తోసిపుచ్చిందా ? అన్నదే అర్ధం కావటం లేదు.  ఎందుకంటే టీడీపీతో పొత్తుకు  సోము వీర్రాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఇక పొత్తు అన్నది డైరెక్టుగా లేకపోతే ఇన్ డైరెక్టుగా కూడా  సాధ్యం కాదని తేలిపోయిన తర్వాతే చంద్రబాబు హఠాత్తుగా అభ్యర్ధిని ప్రకటించారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విషయం ఏదైనా కానీండి తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తుందన్న విషయంపై క్లారిటి వచ్చేసింది. మొత్తానికి తిరుపతిలో పోటీకి రెడీ అవుతోందంటే టీడీపీ చాలా ధైర్యం చేస్తున్నట్లే లెక్క.  ఎందుకంటే ఎప్పుడో అంటే 1984లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున చింతా మోహన్ పోటీ చేసి గెలిచారు. అప్పటి నుండి ఇప్పటివరకు  మళ్ళీ టీడీపీ అభ్యర్ధి గెలిచిందే లేదు. చూద్దాం ఈసారేమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: