స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం-రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య  పంచాయితి పెరిగిపోతోంది.  ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమీషన్ రెడీ అయిపోయిందని నిమ్మగడ్డ ప్రకటించేశారు. ఇదే సందర్భంగా రాజకీయపార్టీలు, ప్రభుత్వం కూడా ఎన్నికల విషయంలో రెడీ అయిపోవాలని నిమ్మగడ్డ ఓ ఉచి త సలహా కూడా పడేశారు. దానికి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నం సమాధానమిస్తు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చేశారు. ప్రభుత్వ సిబ్బంది అంతా కరోనా వైరస్ డ్యూటీల్లో ఉన్నారు కాబట్టి ఎన్నికల నిర్వహణలో ఎవరు పాల్గొనే అవకాశం లేదని చెప్పేశారు. ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల కమీషనర్ ఎన్నికల సన్నాహకం కోసం వీడియో కన్ఫరెన్సు కూడా సరికాదంటు సాహ్ని తన లేఖలో స్పష్టం చేశారు. అయితే సాహ్ని తనకు రాసిన లేఖపై నిమ్మగడ్డ మండిపోయారు. సాహ్నీకి నిమ్మగడ్డ ఘాటుగా మొబైల్ లో ఎస్ఎంఎస్ ద్వారా సమాధానం ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.




చీఫ్ సెక్రటరీకి పంపిన ఎస్ఎంఎస్ లో నిమ్మగడ్డ సమాధానమిస్తు  ఎలక్షన్ కమీషన్ను ప్రభుత్వం అవమానిస్తోందంటూ ఆక్షేపించారు. సీఎస్ రాసిన లేఖలో కమీషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించటమే అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు. ఎన్నికల వ్యవస్ధను కించపరచటం చట్ట విరుద్ధమంటూ విపరీతమైన వ్యాఖ్యలను చేయటమే విచిత్రంగా ఉంది.  నిజానికి ప్రభుత్వాన్ని అవమానిస్తున్నది తానే అన్న విషయాన్ని నిమ్మగడ్డ మరచిపోయినట్లున్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్దంగా లేదని చీఫ్ సెక్రటరీ చెబితే ఎన్నికల సంఘాన్ని కించపరచటం ఎలాగ అవుతుందో నిమ్మగడ్డే చెప్పాలి. యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ సెక్రటరీయే బాస్ అన్న విషయం నిమ్మగడ్డకు తెలీదా ?  రోజుకు 10 వేలకు మించి నమోదైన కేసులు ఇఫుడు రెండు వేలకన్నా తక్కువకు వచ్చేసింది కాబట్టి కరోనా వైరస్ కేసులు తగ్గాయని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. అయితే మార్చిలో ఎన్నికలను వాయిదా వేసినప్పటి 4 కేసులతో పోల్చుకుంటే ఇపుడు నమోదవుతున్న 2 వేల కేసులు ఎంత ఎక్కువో అర్ధం కావటం లేదా ?




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వానికి నిమ్మగడ్డకు మధ్య వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉంది. ఇదే పద్దతి వచ్చే ఏప్రిల్ వరకు కంటిన్యు అవుతుంది. ఎందుకంటే ఏప్రిల్ లో నిమ్మగడ్డ రిటైర్ అయిపోతున్నారు. ఈలోగానే ఏదో పద్దతిలో ప్రభుత్వాని బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతోనే నిమ్మగడ్డ గొడవలు పెట్టుకుంటున్న విషయం అర్ధమైపోతోంది. ఎన్నికలను నిర్వాహించాలని అనుకున్న నిమ్మగడ్డ ముందుగా మాట్లాడాల్సింది ప్రభుత్వంతోనే  అన్న విషయాన్ని కావాలనే పక్కన పెట్టేశారు. ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో లేకపోతే ఎన్నికల  నిర్వహణ సాధ్యం కాదన్న కనీస ఇంగితాన్ని కూడా నిమ్మగడ్డ మరచిపోయినట్లున్నారు. ఇప్పటికే వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ భారిన పడిన విషయం తెలసిందే. మరికొన్ని వేలమంది ఉద్యోగులు కరోనా వైరస్ నియంత్రణ డ్యూటీల్లో ఉన్న విషయాన్ని చెబితే అది ఎలక్షన్ కమీషన్ను కించపరిచినట్లు ఎలా అవుతుందో నిమ్మగడ్డకే తెలియాలి.  ఏదో పద్దతిలో గొడవ పడాలని కాకపోతే ఒంటెత్తు పోకడ ఎలక్షన్ కమీషన్ కు మంచిది కాదని నిమ్మగడ్డ మరచిపోయినట్లున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: