జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరస చూస్తుంటే ఏకంగా సీటుకే ఎసరు పెట్టేట్టున్నాడు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయాలనే విషయంలో మిత్రపక్షాలు బీజేపీ+జనసేనలో ఇఫుడు పెద్ద ఇష్ట్యు అయిపోయింది. ఉపఎన్నికలు ఖాయమని తేలిపోయిన వెంటనే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తాడని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రకటన చేయటమే కాకుండా అవకాశం ఉన్నపుడల్లా జాతీయ స్ధాయి నేతలను కూడా తిరుపతికి తీసుకొచ్చి తన ప్రకటనకు మద్దతుగా వాళ్ళతో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయిస్తారని చెప్పిస్తున్నారు. నేతలతో సమావేశాలని, కార్యకర్తలతో సమావేశాలని ఏదో ఓ కారణం చెప్పి వీర్రాజు తిరుపతిలో హడావుడి మొదలుపెట్టేశారు. తనకు అత్యంత సన్నిహితుడైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని తిరుపతిలోనే మకాం వేయించారు. టీడీపీలోని అసంతృప్త నేతలను, తటస్తులను, కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న నేతలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వివిధ పార్టీల్లోని అసంతృప్తులను కమలం వైపు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అభ్యర్ధికి మిత్రపక్షం జనసేన మద్దతు కూడా ఉంటుందని వీర్రాజే ఏకపక్షంగా ప్రకటించేసుకున్నారు.




ఇదంతా గమనించిన పవన్ కు బాగా చిర్రెత్తింది. అయితే ఏమీ మాట్లాడలేదు. హఠాత్తుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఏకపక్షంగా ప్రకటించేసి ఒక్కసారిగా హీటెక్కించేశాడు. సరే జనసేనను పోటీ నుండి విత్ డ్రా చేయించేందుకు బీజెపీ పడిన అవస్తలన్నీ అందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ గ్రేటర్ ఎన్నికలను పవన్ ఒక ఎరగా వాడుకున్నాడని అర్ధమైపోతోంది. తాము పోటీ చేయాలని అనుకున్నా బీజేపీ రిక్వెస్టు వల్ల విత్ డ్రా చేసుకున్నామని చెప్పుకునేందుకు ఓ వేదిక ఏర్పాటు చేసుకున్నాడు. గ్రేటర్ పోటీ నుండి తప్పుకున్నందుకు ప్రతిఫలంగా తమకు తిరుపతి లోక్ సభలో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినపుడు పవన్ ఇదే ప్రతిపాదన చేసినట్లు టాక్.  ఆ విషయం బయటపడగానే బీజేపీలో లొల్లి మొదలైంది.




తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ మాత్రమే పోటీ చేస్తుందంటూ పార్టీ నాయకులు గోల మొదలుపెట్టేశారు.  ఎట్టి పరిస్ధితుల్లోను పోటీ చేసే అవకాశం  జనసేనకు ఇచ్చేందుకు లేదంటూ తిరుపతిలోని బీజేపీ నేతలు పార్టీ పై ఒత్తిడి మొదలుపెట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజానికి రెండు పార్టీలకు కూడా డిపాజిట్ తెచ్చుకోవటం కూడా అనుమానమే. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి దివంగత ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు గెలిచింది 2.28 లక్షల ఓట్ల మెజారిటితో. బీజేపీకి వచ్చిన ఓట్లెన్నెయ్యా అంటే కేవలం 16 వేలు. ఇక జనసేన మద్దతుతో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధకి వచ్చిన ఓట్లు సుమారు 24 వేలు. అంటే రెండు పార్టీలకు కూడా మొన్నటి ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదన్నది వాస్తవం. అలాంటి పార్టీలు ఇపుడు పోటీ చేయటానికి ఇంతగా పోటీ పడుతున్నాయంటేనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాయని అర్ధమైపోతోంది.  రెండు పార్టీలు కలసినా డిపాజిట్లు తెచ్చుకునేది అనుమానమే. కాకపోతే నేతలను, కార్యకర్తలను ఉత్సాహపరచటానికి వీర్రాజు లాంటి వాళ్ళు గెలుపు మాదే అంటు అప్పుడప్పుడు ప్రకటనలు ఇస్తుంటారంతే. మరి పవన్ డిమాండ్ కు నడ్డా ఏమంటారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: