కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టం దేశంలో ఎంతటి వివాదాస్పదమవుతోందో అందరికీ తెలిసిందే. ఇటువంటి వివాదంలోకి అనవసరంగా మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు వేలుపెట్టారు. నూతన వ్యవసాయ సంస్కరణల చట్టం రైతాంగానికి చాలా మేలు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడితో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు. ఇదే సమయంలో దేశంలోని రైతు సంఘాలు, ఎన్డీయేతర పార్టీలు నూరుశాతం వ్యతిరేకిస్తున్నాయి. రాజకీయ పార్టీల సంగతి ఎలాగున్నా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, రాజస్ధాన్, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని రైతు సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మంగళవారం భారత్ బంద్ కూడా సంపూర్ణమైంది.




నూతన వ్యవసాయ చట్టానికి అటు ఇటుగా రాజకీయపార్టీలు, రైతు సంఘాలు అట్టుడుకిపోతుంటే తగుదున్నమ్మా అంటూ మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజపతిరాజు మధ్యలో ఎందుకు దూరారో ఎవరికీ అర్ధం కావటంలేదు. వ్యవసాయ చట్టం రైతులకు చాలా మంచిదంటు మోడికి మద్దతుగా మాట్లాడారు. ఏదన్నా మార్పు చేయాలంటు ముందు వ్యతిరేకత తప్పదంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రతి మార్పూ ఆరంభంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుందని చెప్పటం విచిత్రంగా ఉంది. మార్పు మంచికోసమే అయినపుడు కచ్చితంగా స్వాగతించాల్సిందే అని తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. రైతు చట్టాలు చారిత్రాత్మకమైనవని, ప్రస్తుతం వ్యవసాయ సంస్కరణలు మనకు చాలా అవసరమని సంచైత అభప్రాయపడ్డారు. రాజకీయంగా వివాదానికి కారణమైన వ్యవసాయ చట్టంపై సంచైత మాట్లాడకుండా ఉండుంటే బాంగుండేది. ఎందుకంటే ఛైర్ పర్సన్ కు వ్యవసాయ చట్టాలతో ఎటువంటి సంబంధం లేదు.




మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ఆ సమస్యల్లో నుండి ఎలా బయటపడాలో తెలీక నానా అవస్తలు పడుతోంది. ట్రస్టులోనే బోలెడు సమస్యలున్నాయి. అన్యాక్రాంతమైన ట్రస్టు భూములను ఎలా కాపాడుకోవాలో తెలీటం లేదు. ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీల్లో చాలా సమస్యలున్నాయి. అవినీతి కారణంగా కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయి. నిజానికి ట్రస్టు సమస్యలను పరిష్కరించాలంటేనే సంవత్సరాలు పడుతుంది.




ఇటువంటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న సంచైత ట్రస్టు విషయాలేవో చూసుకోకుండా రాజకీయంగా వివాదానికి కారణమైన వ్యవసాయ చట్టాల సంగతిని ఎందుకు కెలికారో అర్ధం కావటం లేదు. పార్లమెంటులో చట్టానికి మద్దతిచ్చిన ప్రభుత్వం కూడా ఇపుడు రైతుల భారత్ బంద్ కు మద్దతుగా నిలిచింది. మరి ఈ సమయంలో ప్రభుత్వం ఆలోచనలకు భిన్నంగా అడుగులు వేయటం సంచైతకు అవసరమా ? ట్రస్టు వ్యవహారాలకు మాత్రమే ఛైర్ పర్సన్ పరిమితమైతే బాగుంటుందని వైసీపీ నేతలతో చెప్పించుకోవటం ఎందుకు ?

మరింత సమాచారం తెలుసుకోండి: