కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)ను చంద్రబాబునాయుడుకు అమ్మేశారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చంద్రబాబు ప్రయోజనాల కోసం సీపీఐని జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పుడో అమ్మేశారంటూ పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. పేదలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ఇంటిస్ధలాన్ని కుక్కలదొడ్డితో పోల్చటం నారాయణ విజ్ఞతకే వదిలేసినట్లు చెప్పారు. ఇళ్ళ పట్టాలపై నారాయణ చేసిన వ్యాఖ్యలు లబ్దిదారుల దగ్గరకు వెళ్ళి అనాలని చాలెంజ్ కూడా చేశారు. పైగా ఇంటి స్ధలాల విషయంలో తమకు నారాయణ సర్టిఫికేట్ అవసరం లేదని కూడా తేల్చి చెప్పేశారు. మొత్తం మీద నారాయణపై పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమవుతున్నాయి. నిజానికి సీపీఐని అమ్మేశారనే కామెంట్ ఇపుడు చేశారు కానీ ఇదే విషయమై జనాల్లో ఎప్పటి నుండో అనుమానాలున్నాయన్నది వాస్తవం.




ఇళ్ళస్ధలాల విషయంలో కమ్యూనిస్టులు దశాబ్దాల పాటు ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వామపక్షాలు పేదలకు ఎంత స్ధలాన్ని పంపిణీ చేస్తోంది ? అంటే పేదల కోసం పోరాటాలు చేయటమన్నది వామపక్షాల్లో ఇపుడు తగ్గిపోయింది లేండి. ఇంతకాలం బూర్జువా పార్టీలని ఆరోపణలు చేస్తున్న పార్టీలకే చివరకు అవి అంటే ప్రధానంగా (సీపీఐ) తోకపార్టీ లాగ తయారైపోయింది. దాంతో అసలు ప్రయోజనాలు పోయి కొసరు ప్రయోజనాల కోసమే ఉద్యమాలు చేసే స్ధాయికి దిగజారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో  సీపీఐ వ్యవహరిస్తున్న వైఖరి చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం బలపడుతోంది. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతిలో రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకున్న విషయం తెలిసిందే. అప్పుడేమో రైతులకు మద్దతుగా సీపీఐ ఆందోళనలు చేసింది.





ఇపుడేమో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబుతో సీపీఐ చేతులు కలిపింది. అమరావతిలోనే రాజధాని ఉండాలనే టీడీపీ డిమాండ్ కు అనుగుణంగా సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా తలూపుతున్నారు. ఒక్కోసారి చంద్రబాబును మించి స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు. దీంతో రామకృష్ణ వైఖరి కూడా బాగా వివాదాస్పదమవుతోంది. అంటే రామకృష్ణ వేసే ప్రతి అడుగు నారాయణ అనుమతి లేకుండా పడేందుకు లేదన్న విషయం అందరు అనుకుంటున్నదే. అందుకనే నారాయణ సీపీఐని చంద్రబాబుకు అమ్మేశారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేస్తున్నది. చంద్రబాబు డిమాండ్ ను రామకృష్ణ, నారాయణలు తిరిగి వినిపిస్తున్నారు జనాలకు. టీడీపీ ఆందోళనంటే సీపీఐ కూడా ఆందోళన చేస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికలు జరపకూడదని టీడీపీ అంటే సీపీఐ కూడా అదే డిమాండ్ చేసింది. ఇఫుడు ఎన్నికలు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తుంటే రామకృష్ణ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాతే పెద్దిరెడ్డి సీపీఐని అమ్మేశారని అన్నారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: