అర్జంటుగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిపోవాలి. అందుకు జగన్మోహన్ రెడ్డి ఏమి చేయాలి. వెంటనే సీఎంగా రాజీనామా చేసేయాలి. 151 సీట్ల అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన జగన్ ఎందుకు రాజీనామా చేయాలి. ఎందుకంటే చంద్రబాబు ఆదేశించారు కాబట్టే. జగన్ సీఎం అయిన దగ్గర నుండి ఇదే గోల. రాజీనామా చేసేయ్..సీఎంగా జగన్ ఎంతమాత్రం తగడు..సీఎం కుర్చీలో కూర్చునే అర్హత జగన్ కు ఒక్క నిముషం కూడా లేదు. గడచిన ఏడాదిన్నరగా ఎక్కడ మాట్లాడినా, సందర్భం ఏదైనా తిప్పి తిప్పి చివరకు చంద్రబాబు చేస్తున్న డిమాండ్ ఏమిటయ్యా అంటే జగన్ రాజీనామా చేసేయాలి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని చంద్రబాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ జీవిత చరమాంకంలో తగిలిన దెబ్బ నుండి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కోలుకోలేకపోతున్నారు.
తాజాగా మొదలైన రామతీర్ధం దేవాలయం విధ్వస రాజకీయంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ రాజీనామాను అడగటమే విచిత్రంగా ఉంది. దేవాలయాలపై దాడులు జరగటం తప్పే. విగ్రహాలను నాశనం చేయటం అపచారమే. ఇటువంటి పనులు ఎవరి హయాంలో ఎవరు చేసినా తప్పే అనటంలో సందేహం అక్కర్లేదు. కానీ ఇపుడు జరుగుతున్న దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమైనా ఉందా ? ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏమన్నా ఉందంటే అది నిందితులను పట్టుకోలేకపోవటమే. ఇప్పటివరకు జరిగిన ఏ ఘటనలో కూడా బాధ్యులను పట్టుకోలేకపోవటం ప్రభుత్వ ఫెయిల్యూరే. మరి దీనికి పరిష్కారం ఏమిటి ? జగన్ రాజీనామా చేసేయటమేనా ?
దేవాలయాలను, విగ్రహాలను పరిరక్షించలేకపోవటమే జగన్ నేరమని చంద్రబాబు అంటున్నారు. మరదే నిజమైతే తన హయాంలో విజయవాడలో చంద్రబాబు రాత్రికి రాత్రి 35 దేవాలయాలను కూల్చేయలేదా ? మరప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదు ? దేవాలయాలను ప్రభుత్వమే కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే పుష్కరాల సమయంలో రాజమండ్రిలో 30 మంది చనిపోయారు. పై రెండు ఘటనలకు ప్రత్యక్ష బాధ్యత చంద్రబాబుదే కదా మరపుడు తానెందుకు రాజీనామా చేయలేదు ? పోనీ మిత్రపక్షం బీజేపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో అయినా రాజీనామా ఎందుకు చేయించలేదు ? అంటే తన హయాంలో జరిగినవన్నీ ఒప్పులు, జగన్ హయాంలో జరుగుతున్నవన్నీ తప్పులేనా ? అప్పట్లో ఘటనను ఘటనగానీ చూశారు కాబట్టే జగన్ కానీ వైసీపీ నేతలు కానీ చంద్రబాబు రాజీనామాను డిమాండ్ చేయలేదు. ఇపుడు ప్రతి ఘటనలోను రాజకీయంగానే చూస్తున్నారు కాబట్టే జగన్ రాజీనామాను చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి జగన్ రాజీనామా చేసేయాల్సిందే.