అవుట్ డెటెడ్ పాలిటిషియన్ ముద్రగడ పద్మనాభానికి మొత్తానికి ఓ పార్టీ దొరకబోతోందా ? అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముద్రగడ అంటే ఒకపుడు ఏమో కానీ ఇపుడు మాత్రం లేస్తే మనిషిని కాదన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన చెబితే వినేవాళ్ళు లేరు, దగ్గరకు రానిచ్చే పార్టీ కూడా లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్ధితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కిర్లంపూడికి వెళ్ళి ముద్రగడను కలవబోతున్నారట. ప్రత్యేకంగా ముద్రగడను వీర్రాజు ఎందుకు కలుస్తారు ? ఇంకెందుకు పార్టీలోకి ఆహ్వానించటానికే అన్నది ఓ విశ్లేషణ. ఎందుకంటే ముద్రగడకు ఇప్పటికిప్పుడు అర్జంటుగా ఓ పార్టీ అవసరం చాలా ఉంది. అలాగే బీజేపీకి కూడా నేతల అవసరం ఇంకా ఉంది. దాంతో బీజేపీలో చేరటానికి ముద్రగడను వీర్రాజు ఆహ్వానించబోతున్నారన్నది లేటెస్టు టాక్.
ఒకపుడు ముద్రగడ పద్మనాభం అంటే తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజల్లో ప్రత్యేకించి కాపు సామాజికవర్గంలో ఓ క్రేజుండే మాట వాస్తవమే. అయితే తన నిలకడలేమి రాజకీయాలతో, అసంబద్దమైన డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుంటారు. తానేదో తిరుగులేని నేతనని ముద్రగడకు బాగా నమ్మకం. అందుకనే చీటికి మాటికి నిరాహార దీక్షలంటూ ఇంట్లో తలుపులకు తాళాలు వేసుకుని కూర్చుటుంటారు. ఈయన డిమాండ్లు ఎప్పటికీ ఆచరణసాధ్యం కాదని అందరికీ తెలిసినా ముద్రగడ మాత్రం తన పంతాన్ని వదలరు. చివరకు నాలుగు రోజులు దీక్షలు చేశామనిపించి మొత్తానికి దీక్షలను ఎత్తేస్తుంటారు. ఇటువంటి చర్యలతోనే జనాల్లో బాగా పలుచనైపోయారు. ఇపుడు పరిస్ధితి ఏమిటయ్యా అంటే ముద్రగడ దీక్షలన్నా, ఏమి మాట్లాడినా ప్రభుత్వాలు కాదు కదా చివరకు జనాలు కూడా పట్టించుకోవటం మానేశారు.
ఇటువంటి నేపధ్యంలోనే ముద్రగడను బీజేపీ అధ్యక్షుడు కమలంపార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. ఎంఎల్ఏగా, మంత్రిగా ఎంపిగా కూడా ముద్రగడ గతంలోనే పదవులు చేసున్నారు. అయితే అదంతా చరిత్రగా చెప్పుకోవాలి. ఆయనకేమీ వయస్సయిపోలేదు కాబట్టి ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండే అవకాశాన్ని కొట్టేయలేం. కాబట్టి బీజేపీలో చేరిన తర్వాత కొంతకాలం యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. కాకినాడ ఎంపిగానో లేకపోతే కాకినాడ ఎంఎల్ఏగానో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఒకవేళ ముద్రగడ ఎన్నికల్లో పోటీచేస్తే పార్టీ ఓట్లు+ఎన్నోకొన్ని సొంత ఓట్లు+సామాజికవర్గం ఓట్లను తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి పార్టీకి ముద్రగడ ఏదోరూపంలో ఉపయోగపడతాడనే అనుకుంటున్నారు. చూద్దాం ముద్రగడ సరికొత్త ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతోందో.