చంద్రబాబునాయుడు జమిలి ఎన్నికల జపాన్ని అస్సులు వదలటం లేదు. జమిలిని మొదలుపెట్టిన నరేంద్రమోడికి కూడా ఇపుడు ఆ ఆలోచన ఉందో లేదో తెలీదు కానీ చంద్రబాబు మాత్రం దాన్ని పట్టుకుని ఊగిపోతున్నారు. తాజాగా మూడు రోజుల కుప్పం పర్యటనలో కూడా ఇదే విషయాన్ని బాగా హైలైట్ చేశారు. మరో ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వచ్చేయబోతున్నాయని చెప్పారు. జమిలిలో తెలుగుదేశంపార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరట. అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు వైసీపీ చేస్తున్నదానికి మామూలు వడ్డీ కాదట చక్రవడ్డీతో పాటు తిరిగి చెల్లింపులు చేస్తామంటు నోటికేదొస్తే అదంతా మాట్లాడేశారు. చంద్రబాబు ధోరణి చూస్తుంటే జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కేంద్రంలోని బీజేపీ వెనక్కు తగ్గినా ఆయన తట్టుకోలేరనట్లుగా తయారైపోయారు.




అసలు జమిలి విషయంలో మోడినే ఇపుడు మాట్లాడటం లేదు. ఎందుకంటే రోజురోజుకు ప్రజాగ్రహం పెరిగిపోతోంది. గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలతో జనాలంతా మోడి అంటేనే మండిపోతున్నారు. నరేంద్రమోడిపై తమకున్న మంటను రకరకాలుగా వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం హఠాత్తుగా సోషల్ మీడియా నియంత్రణ చట్టాన్ని తెచ్చింది. దీనికితోడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందో లేదో తెలీదు. అందుకనే క్షేత్రస్ధాయిలో పరిస్దితులను గమనించిన తర్వాత మోడి అసలు జమిలి ఎన్నికల గురించి పెద్దగా మాట్లాడటం లేదు.




ఇదే సమయంలో మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దాదాపు చతికిలపడినట్లే. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు, తర్వాత జరిగే పరిషత్ ఎన్నికల్లో కూడా పంచాయితి రిజల్ట్సే రిపీట్ అయితే టీడీపీ పరిస్ధితి గోవిందానే. పంచాయితి ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేవు కాబట్టి సరిపోయింది. కానీ మున్సిపల్, పరిషత్ ఎన్నికలు పార్టీల గుర్తుల మీదే జరుగుతుంది. కాబట్టి కాకిలెక్కలు చెప్పేందుకు లేదు. అప్పుడు కూడా దెబ్బపడితే పార్టీలో నేతలను, దిగువస్ధాయి కార్యకర్తలను పట్టి పెట్టుకోవటం చంద్రబాబుకు తలకుమించిన పనవుతుంది. ఆ సమస్య తలెత్తకుండానే ముందునుండే జమిలి ఎన్నికలు వచ్చేయబోతున్నట్లు, టీడీపీ గెలుపు ఖాయమన్నట్లు ఒకటే ఊదరగొడుతున్నారు. మరి నిజంగానే ఆ ముచ్చట కూడా తీరిపోతే అప్పుడు కానీ తెలీదు చంద్రబాబు బండారం.

మరింత సమాచారం తెలుసుకోండి: