జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది ఎప్పుడూ పాత పాటే. అప్పుడూ ఇపుడు కూడా వైసీపీకి ఓటు వేయద్దని చెప్పటమే ధ్యేయంగా పెట్టుకున్నట్లున్నారు. ఎవరైనా తమకు ఓటు వేయమని అడుగుతారు. కానీ పవన్ మాత్రం విచిత్రంగా వైసీపీకి ఓట్లేయద్దని ఓటర్లకు పిలుపినిచ్చారు. అప్పుడెప్పుడో అంటే 2019లో జరిగిన అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికల్లో పవన్ రోడ్డుషోలు, బహిరంగసభల్లో ప్రసంగించారు. అప్పుడు కూడా ఎక్కడ మాట్లాడినా వైసీపీకి ఓట్లేయద్దని, వైసీపీని ఓడించండనే మొదట పిలుపినిచ్చారు. దాంతో పవన్ను జనాలు విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. తన పార్టీ యవ్వారమేదో చూసుకోకుండా ఎదుటిపార్టీ యవ్వారాలెందుకని అనుకున్నారు. దాంతో జనాలు కళ్ళు మూసుకుని వైసీపీకి ఓట్లు గుద్దేశారు. దాంతో పవన్ కు కళ్ళు తిరిగి బొమ్మ కనబడింది.




పనిలో పనిగా మిగిలిన అభ్యర్ధులతో పాటు రెండు చోట్ల పోటీ చేసిన జనసేనానిని కూడా చిత్తుగా ఓడగొట్టారు. దాంతో రాజోలులో జనసేన అభ్యర్ధిగా పోటి చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచిపోయారు. రాపాక ఎందుకు గెలిచారంటే ఆయన్ను జనసేన అభ్యర్ధిగా జనాలు చూడలేదు. ఎందుకంటే జనసేన తరపున నామినేషన్ వేసేముందు వరకు ఆయన వైసీపీ నేతే. వైసీపీలో తనకు టికెట్ రాదని అర్ధమైన చివరిక్షణంలో జనసేనలోకి దూకేసి టికెట్ తెచ్చేసుకున్నారు. కాబట్టి వైసీపీ నేతగా జనాల్లోను, క్యాడర్లోను ఉన్న పట్టు కారణంగా రాపాక గెలిచిపోయారు. దాంతో జనసేన తరపున గెలిచిన ‘ఒకే ఒక్కడు’గా రాపాక రికార్డు సృష్టించారు.




అప్పట్లో తమ పార్టీకి జనాలు ఓట్లెందుకు వేయలేదు, తానెందుకు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను ఓడిపోయాననే విషయమై పవన్ నిజాయితిగా విశ్లేషించుకున్నట్లు లేదు. అందుకనే తాజాగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీకి ఓట్లు వేయద్దనే పిలుపిచ్చారు. మరి జనాలు ఇపుడైనా పవన్ మాటవింటారా ? లేకపోతే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాగే రివర్సులో జనసేననే చిత్తుగా ఓడిస్తారా అన్నది చూడాలి. అయితే ఇక్కడో విషయం ఉంది. అదేమిటంటే ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ ఇద్దరు కూడా వైసీపీని చిత్తుగా ఓడించమని జనాలకు పిలుపిస్తున్నారే కానీ తమ పార్టీల అభ్యర్ధులకు ఎందుకు ఓట్లేయాలన్న విషయం మీద మాత్రం క్లారిటి ఇవ్వటం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: