అవును చంద్రబాబునాయుడు కోరికను జనాలు తీర్చేసినట్లే అయ్యింది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసిన సమయంలో వైసీపీకి ఓట్లేస్తే అమరావతిని మరచిపోవచ్చని పదే పదే చెప్పారు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటంటే పై రెండు కార్పొరేషన్లలో వైసీపీని ఓడించాలని. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులను గెలిపిస్తే అమరావతి సెంటిమెంటు ఉందని జనాలు చెప్పినట్లవుతుందని అనుకున్నారు. కొన్నిసార్లు పరోక్షంగా మరికొన్ని సార్లు పరోక్షంగా ప్రచారంలో ఊదరగొట్టారు. తీరా చూస్తే జనాలు అసలు అమరావతి సెంటిమెంటే లేదని తమ ఓట్లతో తేల్చి చెప్పేశారు. అంటే రెండు చోట్లా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.
తాజాగా వచ్చిన ప్రజాతీర్పుతో చంద్రబాబు ఇకపై అమరావతి అంటు నోరెత్తకూడదు. ఒక్క రెండు కార్పొరేషన్లే కాదు పై రెండు జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కూడా వైసీపీనే జెండా ఎగరేసింది. కనీసం ఒక్కటంటే ఒక మున్సిపాలిటిలో కూడా టీడీపీ గెలవలేదు. దీంతో జనాల మద్దతు ఎవరికో స్పష్టంగా తేలిపోయింది. ఆమధ్య జరిగిన పంచాయితి ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు చాలా హడావుడే చేశారు. పంచాయితి ఎన్నికలంటే పార్టీల గుర్తులు లేకుండా జరిగినవి కాబట్టి కొన్నింటినైనా క్లైం చేసుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆ అవకాశం లేకపోయింది. పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికల కాబట్టి నోటికొచ్చిన కాకిలెక్కలు చెప్పే అవకాశం లేకపోయింది.
తాజా ఫలితాలతో భవిష్యత్తులో అమరావతిపై ప్రజా తీర్పని, రెఫరెండమని, రాజీనామాలని చంద్రబాబు అండ్ కో నోరెత్తటానికి లేకుండా పోయింది. అమరావతి చుట్టుపక్కల పంచాయితిలు, మున్సిపాలిటీలు కూడా నూరుశాతం వైసీపీ ఖాతాలోనే పడటంతో మామూలు జనలు చంద్రబాబును పట్టించుకోవటం లేదని తేలిపోయింది. మరి అమరావతి కోసమంటూ గడచిన 400 రోజులుగా దీక్షలు చేస్తున్న జనాలకు జనాలు ఏమి సందేశం ఇచ్చినట్లు ? మరి తాజా తీర్పుతో ఆందోళనకారులు తమ దీక్షలను విరమించుకుంటారా ? అన్నది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో వైజాగ్ కార్పొరేషన్ కూడా వైసీపీనే గెలుచుకుంది. కాబట్టి కోస్తాలోనే కాదు వైజాగ్ లో కూడా చంద్రబాబు మాట చెల్లలేదు. మరి తాజా ఫలితాలపై చంద్రబాబు ఏమంటారో చూడాలి.