అవును ఒకపుడు తిట్టిన నోటితోనే జగన్మోహన్ రెడ్డిని ఇపుడు జేసీ ప్రభాకర్ రెడ్డి విపరీతంగా పొగిడేశారు. నిజానికి జగన్-జేసీ బ్రదర్స్ బద్ధ శతృవులన్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోకి వచ్చినా జగన్ను అనంతపురంకు చెందిన జేసీ బ్రదర్స్ నోటికొచ్చినట్లు తిట్టడం మామూలైపోయింది. అలాంటిది తాడిపత్రి మాజీ ఎంఎల్ఏ, తాజాగా మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎంను విపరీతంగా పొగిడేశారు. జగన్ను  నైతిక విలువలున్న వ్యక్తిగా జేసీ ప్రభాకర్ అభివర్ణించటంతో అందరు షాక్ కు గురయ్యారు.




మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన తర్వాత ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఛైర్మన్ గా ఎన్నికయ్యానంటే అది జగన్ కున్న నైతిక విలువల వల్లే అంటు చెప్పారు. జేసీ మాటలు వినగానే ఒక్కసారిగా అందరికీ షాక్ కొట్టినట్లయ్యింది. విషయం ఏమిటంటే తాడిపత్రి మున్సిపాలిటిలో 36 వార్డుల్లో టీడీపీకి 18 వార్డులు, వైసీపీకి 16 వార్డులు దక్కాయి. రెండు ఎక్స్ అఫీషియో ఓట్లను కలుపుంటే వైసీపీకి కూడా 18 ఓట్లు వచ్చాయి. దాంతో ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ కౌన్సిలర్ గా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు.




నిజానికి వైసీపీకి ఛైర్మన్ పదవి దక్కాలని జగన్ అనుకునుంటే ఏదో పద్దతిలో ఎన్నికను వాయిదా వేయించటమో లేకపోతే ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్లను లాగేసుకోవటం పెద్ద విషయం కాదు. అయితే అధికారపార్టీ అలాంటి పనులేవీ చేయలేదు. పైగా ఛైర్మన్ ఎన్నిక జరిగే సమయంలో మున్సిపల్ ఆఫీసుకు రావాలని అనుకున్న ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఆపేశారు. అధికార పార్టీ ఎంఎల్ఏని కూడా పోలీసులు ఆపేసి ఛైర్మన్ ఎన్నికను సజావుగా జరిపించారు. ఈ విషయాలను గమనించిన తర్వాతే ఛైర్మన్ సీఎంను ప్రశంసలతో ముంచెత్తారు. ఎంఎల్ఏలైనా ఇతర ప్రజాప్రతినిధులైనా రాజీనామాలు చేస్తే కానీ పార్టీలో చేర్చుకునేది లేదనే స్వీయ నియమానికి జగన్ కట్టుబడి ఉండటం వల్లే తాను టీడీపీ నుండి ఛైర్మన్ గా ఎన్నికైనట్లు ప్రభాకర్ చెప్పటం విశేషం.


 

మరింత సమాచారం తెలుసుకోండి: