ప్రస్తుతం దేశంలో విచిత్రమైన పరిస్దితులు రాజ్యమేలుతున్నాయి. ఎవరైనా, ఎక్కడైనా అనారోగ్యంతో మరణిస్తారు. లేకపోతే ప్రమాదాల్లో చనిపోతుంటారు. కానీ ఇపుడు ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. ప్రాణాపాయ సమయంలో ఆక్సిజన్ పెట్టి రోగులను డాక్టర్లు కాపాడుతుంటారు.  అలాంటిది ఇపుడు ఆక్సిజన్ లేకే రోగులు చనిపోతున్నారు. దేశంలోని చాలా చోట్ల ఆక్సిజన్ లేదని డాక్టర్లు నిక్కచ్చిగా చెప్పేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అయితే ఆక్సిజన్ తెచ్చుకుంటేనే రోగులను చేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ లీకవ్వటంతో 24 మంది చనిపోవటం ఎంత బాధాకరమో. రోగులకు పెట్టిన పైపులో నుండి ఆక్సిజన్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమి జరిగిందో ఎవరికీ అర్ధంకాలేదు. ఆక్సిజన్ పైపులైన్ కు చిల్లు పడటంతో ఆక్సిజన్ మొత్తం గాలిలో కలిసిపోయింది. రోగుల శరీరాల్లోకి వెళ్ళాల్సిన ఆక్సిజన్ గాలిలో కలిసిపోవటంతోనే 24 మంది చనిపోయారు.




దేశంలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత అన్నది ఇప్పటివరకు ఎప్పుడూ ఎవరు విన్నదిలేదు. 100 పడకల ఆసుపత్రిలో కూడా రోజుకు ఏ ఇద్దరికో లేకపోతే ముగ్గురికో ఆక్సిజన్ అవసరం అవుతుందంతే. వరంగల్లో ఎంజీఎం ప్రభుత్వాసుపత్రితో పాటు 50 ప్రైవేటు ఆసుపత్రిలు కరోనా రోగులకు చికిత్సలు అందిస్తున్నాయి. పై ఆసుపత్రులన్నింటిలో కలిపి మొన్నటివరకు  రోజుకు 500 మందికి ఆక్సిజన్ అవసరమైతే అదే చాల ఎక్కువ. అలాంటిది కరోనా వైరస్ సెకెండో వేవ్ కారణంగా ఇపుడు రోజుకు 2 వేల మందికి ఆక్సిజన్ అవసరమవుతోంది.  డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవటంతో ఆక్సిజన్ సరఫరా లేక రోగులు నానా అవస్తలు పడుతున్నారు. ముంబాయ్ ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ సరపడా సరఫరా లేని కారణంగా రోగులను చేర్చుకోవటంలేదు.




విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని ఐదు ఆక్సిజన్ కేంద్రాల ఉత్పత్తి సామర్ధ్యం 3 వేల టన్నులు. అయితే స్టీల్ ప్లాంటులో లోకల్ అవసరాలకోసం ఎంత కావాలో అంతే ఉత్పత్తి చేస్తారు. కానీ దేశంలోని ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 120 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణా, మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఆక్సిజన్ రోజూ సరఫరా అవుతున్నా ఏమాత్రం సరిపోవటంలేదు. అవకాశం ఉందికదాని ఎంతపడితే అంత సరఫరా చేయటానికి లేదు. అలాగే ఉత్పత్తి చేసిన ఆక్సిజనంతా సరఫరా చేసే అవకాశమూలేదు. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తవుతున్నా విశాఖ స్టీల్ ప్లాంటుదే అగ్రస్ధానమని చెప్పాలి. మొత్తానికి దేశంలో పరిస్ధితి ఎలా తయారయ్యిందంటే రోగులు కరోనాతో కాకుండా ఆక్సిజన్ కొరతతోనే చనిపోతున్నట్లున్నారు. మరి ఈ పరిస్ధితి ఎప్పుడు సద్దుమణుగుతుందో ఏమో.

మరింత సమాచారం తెలుసుకోండి: