చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో మాట్లాడినా, మీడియా సమావేశం పెట్టినా ఆవు వ్యాసం గురించి తప్ప ఇంకేమీ ఉండదు. తాజాగా మీడియాతో మాట్లాడుతు కరోనా వైరస్ ప్రపంచంలో ఎవరు కనివినీ ఎరుగని మహావిపత్తుగా అభివర్ణించారు. అయినా ఏపిలో సమస్య పెరిగిపోవటానికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సరిగా జరగకపోవటానికి కూడా జగనే కారణమట. ఇలా ఏ సమస్యను ప్రస్తావించినా దానికి జగనే కారణమని పదే పదే ఆరోపించారు. గంటపాటు జరిగిన మీడియా సమావేశంలో 60 నిముషాలు జగన్ను తప్పుపట్టడం, బురదచల్లేయటం, విమర్శలు చేయటానికే కేటాయించారు. చంద్రబాబు మాట్లాడినదాంట్లో నరేంద్రమోడిని విమర్శించలేక, ఆరోపణలు చేయలేక, మోడి తప్పులను కూడా జగన్ ఖాతాలోనే వేసేశారు. నిజానికి చంద్రబాబు అనాల్సిందంతా మోడిని అయితే టార్గెట్ చేసింది మాత్రం జగన్ను.
టీకాలు రాష్ట్రానికి సరిపడా రాకపోవటానికి, ఆక్సిజన్ సరఫరా సరిపడా లేకపోవటానికి నరేంద్రమోడి చేతకాని తనమే కారణం. దేశంలోని అనేకమంది ముఖ్యమంత్రులు ప్రస్తుత పరిస్దితికి మోడి కారణమని అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్నే నిందిస్తున్నారు. టీకాలు, ఆక్సిజన్ అన్నది కేంద్రం పరిధిలో ఉన్నది. ఏ రాష్ట్రానికైనా టీకాలను, ఆక్సిజన్ను కేంద్రమే కేటాయిస్తోంది. ఈ విషయం బాగా తెలిసి కూడా జగన్నే టార్గెట్ చేయటంలో చంద్రబాబు చాలా ఆనందాన్నే పొందుంటారు. టీకాల కోసం జనాలు అల్లాడుతున్నా జగన్ ఏమీ పట్టించుకోవటం లేదంటు మండిపోయారు. మరో సందర్భంగా 56 లక్షల మందికి మొదటిడోసు వేసిన ప్రభుత్వం రెండో డోసును 11 లక్షల మందికి మాత్రమే వేసి ఎందుకు ఆపేసిందని అడగటమే ఆశ్చర్యంగా ఉంది.
కరోనా విపత్తును ప్రపంచంలో ఎవరు కూడా ఊహించలేదని ఒకవైపు చెబుతునే రాష్ట్రంలో పరిస్ధితిలు అదుపుతప్పటానికి మాత్రమే జగనే కారణమని చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజానికి కరోనా వైరస్ ఉదృతికి నరేంద్రమోడి నిర్లక్ష్యమే కారణమని ప్రపంచమీడియా దుమ్ముదులిపేసింది. మోడిపై ఆరోపణలు చేసే ధైర్యంలేని చంద్రబాబు కేంద్రం తప్పులను కూడా జగన్ ఖాతాలో వేసేశారు. టీకాలు ఉత్పత్తి చేసే కంపెనీలతో మాట్లాడాల్సిన బాధ్యత జగన్ కు లేదా ? అంటు నిలదీయటమే ఆశ్చర్యం. ఇప్పటికే అవసరమైన టీకాల కోసం జగన్ సీరమ్, భారత్ బయోటెక్ కంపెనీలతో మాట్లాడి, లేఖలు కూడా రాశారు. మళ్ళీ మరో సందర్భంలో ఫార్మా కంపెనీలకు లేఖలు రాస్తే చాలా ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని అడిగారు. మొత్తానికి కరోనా వైరస్ ఉదృతి నియంత్రణకు జగన్ తీసుకుంటున్న చర్యలను సమర్ధించలేక, మోడిని పల్లెత్తు మాటనలేక గంటసేపు ఆవువ్యాసం వినిపించి చివరకు మీడియా సమావేశం ముగించారు.