కృష్ణపట్నం అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. నెలరోజుల క్రితం వరకు కృష్ణపట్నం అంటే ఏదో పోర్టు ఆధారిత ప్రాంతమన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు. అయితే యావత్ ప్రపంచం మొత్తానికి తెలిసింది మాత్రం కరోనా వైరస్ కు ఆనందయ్య అనే వ్యక్తి చుక్కల మందు ఇస్తున్న విషయం సోషల్ మీడియాలో వెలుగుచూసిన తర్వాతే. ఎప్పుడైతే ఆనందయ్య చుక్కల ముందుతో కరోనా వైరస్ సోకదని, ఒకవేళ సోకినా కిలోమీటర్ల దూరం పారిపోతుందని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. దాంతో మొదట్లో పదులు తర్వాత వందలుగా మారిన జనాలు చివరకు వేలసంఖ్యలోకి చేరుకున్నారు. ఒకవైపు కరోనా దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతుండటంతో ఆనందయ్య మందుకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దాంతో అందరిదృష్టి పడటంతో చివరకు ఆనందయ్య మందు పరిస్ధితి ఏమిటో అందరు చూస్తున్నదే.




సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అసలు ఆనందయ్య చుక్కల మందు ఎలా పాపులర్ అయ్యిందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో కోరనా వైరస్ విజృంభిస్తున్నా కేవలం ఆనందయ్య మందు వల్లే కృష్ణపట్నం మేజర్ పంచాయితిలో ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదనే చెప్పుకున్నారు. ఇదెంతవరకు నిజమో తెలీదు. అయితే ప్రస్తుత పరిస్ధితి ఏమిటంటే కృష్ణపట్నం గ్రామంలో ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో 30 మందికి కరోనా లక్షణాలున్నాయని అధికారులు గుర్తించారు. ఎందుకంటే కృష్ణపట్నం గ్రామానికి చుక్కల మందుకోసం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండే కాకుండా తమిళనాడు, తెలంగాణా, కర్నాటక నుండి జనాలు పోలోమంటు ఎగబడిపోయారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు 15 రోజులు జనాలు గ్రామానికి వచ్చింది వచ్చిందే.




ఇతర రాష్ట్రాల నుండే కాకుండా ప్రాంతాల నుండి కూడా తమ గ్రామానికి జనాలు మందుకోసం వచ్చినపుడు తమ గ్రామంలోని వారికి కరోనా వైరస్ సోకుంటుందని ఇపుడు గ్రామస్తులు మండిపోతున్నారు. రెండువారాల క్రితం వరకు తామంతా క్షేమంగానే ఉన్నామని బయట ప్రాంతాల వాళ్ళవల్లే ఇపుడు తమ గ్రామంలోకి కరోనా వైరస్ ప్రవేశించిందంటు తెగ బాధపడిపోతున్నారు. ఆనందయ్య చుక్కల మందును తీసుకోవాలని వచ్చిన బయటవాళ్ళు మొత్తం గ్రామమంతా తిరిగేయటం వల్లే తమకు ఇబ్బందులు మొదలయ్యాయంటు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలొకి వచ్చే వాళ్ళల్లో కొందరు కరోనా వైరస్ తో రావటం వల్లే అది తమకు అంటుకుందని ఇపుడు గ్రామస్తులు లబోదిబో మంటున్నారు.  మొత్తానికి కరోనా వైరస్ మందుకోసం వచ్చిన వాళ్ళే గ్రామానికి కరోనా అంటించేసినట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: