తాజా సమీక్షలో జగన్ చెప్పిన మాటలను బట్టి చూస్తే.. ఏపీలో విద్యావ్యవస్థలో పెద్ద మార్పులే చేయబోతున్నారు. ఏపీలో నూతన విద్యావిధానం అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించారు. వాటిలో మొదటిది శాటిలైట్ స్కూల్స్ ఇందులో పీపీ-1, పీపీ-2 తరగతులు వస్తాయి. రెండోది ఫౌండేషన్ స్కూల్స్.. ఇందులో పీపీ-1, పీపీ-2. 1, 2 వస్తాయి. మూడోది ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్.. ఇందులో పీపీ-1 నుంచి 5వ తరగతి వరకు వస్తాయి.
ఇక నాలుగోది ప్రీ హైస్కూల్స్.. అంటే 3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు అన్నమాట. ఐదోది హైస్కూల్స్.. అంటే 3 నుంచి 10వ తరగతి వరకు అన్నమాట. ఆరోది హైస్కూల్ ప్లస్.. ఇందులో 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వస్తాయి. ఈ కొత్త విద్యావిధానం ద్వారా ప్రతి సబ్జెక్ట్‌కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక తరగతి గది ఉంటాయి. ఏపీలో కొత్తగా 4,800 తరగతి గదులు అవసరం అవుతాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏ విద్యార్థి కూడా చదువులో వెనుకబడకూడదంటున్నారు సీఎం జగన్. మంచి విద్య అందించాలనే లక్ష్యంతో పని చేయాలని సూచిస్తున్నారు. విద్యారంగం కోసం ఖర్చు చేయడంలో వెనుకంజ వేయబోమని పునరుద్ఘాటిస్తున్నారు. మరి ఇలా జగన్ చెప్పే మాటలన్నీ నిజమైతే ఏపీ విద్యారంగంలో పెను విప్లవం ఖాయం. మాటలన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ చేతల్లోకి మారితే రాష్ట్ర విద్యారంగ ముఖ చిత్రమే మారుతుంది.