టీడీపీ ఇప్పుడు ఏపీలో నానా తిప్పలు పడుతోంది. వైసీపీ నుంచి ఎదురయ్యే అనేక రకాల దాడులను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతోంది. పట్టాభి బూతులతో ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు తమ కార్యాలయాలపై దాడులు చేశారు.. ఏపీలో అరాచకం జరుగుతోందంటూ.. చంద్రబాబు ఢిల్లీకి కూడా వెళ్లొచ్చారు.. రాష్ట్రపతిని కలిశారు కూడా. టీడీపీ నేతలు ఇలా బిజీగా ఉంటే.. చంద్రబాబు అటు హూజూరాబాద్ ఎన్నికల్లోనూ వేలు పెట్టారన్న వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.


తన పాత శత్రువు కేసీఆర్‌ను చెక్ పెట్టేందుకు చంద్రబాబు హుజూరాబాద్‌ ఎన్నికల్లో వేలు పెట్టారట. ఈ మేరకు ఈటల రాజేందర్‌ విజయవాడ వెళ్లి మరీ చంద్రబాబును కలిశారట. ఏయ్.. ఈటలా.. నీకేం ఇబ్బంది లేదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మావాడే.. హైదరాబాద్  వెళ్లి రేవంత్ రెడ్డిని కలువు.. నేను చెబుతాలే.. నీకు అనుకూలంగా ఓటేయమని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలని నేను చెబుతాలే.. ఏం పర్లేదు.. నీ గెలుపునకు నేను అన్ని విధాలుగా మద్దతు ఇస్తా.. నువ్వూ, నేనూ, రేవంత్ రెడ్డి కలిస్తే.. ఆ కేసీఆర్ ఎంత.. అందరం కలిసి ఓడిద్దాం.. అని చంద్రబాబు ఈటలకు భరోసా ఇచ్చాడట.


అంతే కాదు..చంద్రబాబు సూచించినట్టే ఈటల హైదరాబాద్ వచ్చి రేవంత్ రెడ్డిని రహస్యంగా కలిశారట.. ఇదిగో ఇలా సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మామూలుగా చెబితే నమ్మరని.. ఏదో పత్రికలో వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ వార్త వచ్చిన పత్రిక ఏదో మాత్రం ఎవరకీ తెలియడం లేదు.. ఇది ఒరిజినలా.. ఫేకా.. అన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. మన వాట్సప్ యూని వర్శిటీ సంగతి తెలుసుకదా.. అదిగో తోక.. అంటే ఇదిగో పులి అనే బాపతు కదా.


అయితే ఇవన్నీ ఈటలపై దుష్ప్రచారం కోసం చేస్తున్న వ్యూహాలే అంటున్నారు బీజేపీ నేతలు. ఈటలపై చంద్రబాబు ముద్ర వేసి.. మరోసారి సెంటిమెంట్ రగల్చాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మొత్తానికి మరోసారి తెలంగాణలో చంద్రబాబు వేలు పెట్టాడన్న అంశంపై చర్చ మాత్రం సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: