ఈనెల 4న జగన్ సర్కారు మొత్తం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఏపీలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. అదే రోజు వై.ఎస్.ఆర్.జిల్లా, అన్నమయ్య జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఈ రెండు జిల్లాలకు మూడు రెవిన్యూ డివిజన్ల చొప్పున కేటాయించింది. వై.ఎస్.ఆర్.జిల్లాలో ఇప్పటివరకు కడప, జమ్మలమడుగు, బద్వేలు రెవిన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. అయితే.. తాజాగా గురువారం మంత్రిమండలి సమావేశంలో పులివెందులను కూడా రెవిన్యూ డివిజన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కడప జిల్లలా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, లింగాల, వేంపల్లె, వేముల, చక్రాయపేట, సింహాద్రిపురం, తొండూరు మండలాలతోపాటు ఇప్పుడు కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలాన్ని కూడా చేర్చి పులివెందుల పేరుతో కొత్త రెవిన్యూ డివిజన్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ లో ఉన్న పులివెందుల నియోజకవర్గం... ఇపుడు కొత్త రెవిన్యూ డివిజన్ గా మారిందన్నమాట.
ఈ మార్పుతో వై.ఎస్.ఆర్.జిల్లాలో 36 మండలాలకు నాలుగు రెవిన్యూ డివిజన్లు అయ్యాయి. ఇటీవలే ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంను కూడా సీఎం జగన్ రెవిన్యూ డివిజన్ చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులను కూడా రెవిన్యూ డివిజన్ గా చేసుకున్నారు. ఇలా రెవెన్యూ డివిజన్ల విషయంలో మాత్రం చంద్రబాబు హ్యాపీ.. జగన్ కూడా హ్యాపీ అన్న సెటైర్లు పేలుతున్నాయి.