తెలుగు వెండితెర‌పై న‌వ్వులు విర‌బూయించ‌డ‌మే కాదు... ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా కూడా తెలుగు సినిమా అభివృద్ధికి దోహ‌దం చేశారు ప‌ద్మ‌నాభం. పద్మనాభం ( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010)  పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఆయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు. ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.


ఐదేళ్ళ వయసులో (1936లో) "చింతామణి" నాటకంలో కృష్ణుడివేషం వేసి వన్స్ మోరులతోబాటు ఒక వెండికప్పు బహుమతిగా పొందాడు. స్త్రీపాత్రలకు ప్రసిద్ధిపొందిన కొండపేట కమాల్ ఈ నాటకంలో చింతామణి కాగా పద్మనాభం తండ్రి శ్రీహరి పాత్రధారి.తర్వాత తమ్ముడు సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుని, యాయవరం చేసుకుని చదువుకున్నా చదువు వంటబట్టలేదు. థియేటర్ మేనేజర్ ను మంచిచేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడానికి ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగుళూరు వెళ్ళి అక్కడేం చెయ్యాలో తోచక మద్రాసు వెళ్ళారు. అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు.


తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరీ వారి కంపెనీలో కుదురుకున్నారు. ఆ తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకొకవైపు సి.ఎస్.ఆర్. లాంటివాళ్లతో కలిసి భక్త తుకారాం లాంటి నాటకాల్లో 50, 60 ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ఋష్యేంద్రమణి వాళ్ళ ట్రూపులో పాదుకాపట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు, మొదలైన నాటకాల్లో నటించాడు. 1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు. చెన్నై లో ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: