నాన్న ఎప్పుడూ ఒంటరివాడే.. అమ్మా, పిల్లలూ ఒక్కటౌతుంటారు ఈ సృష్టిలో.. నాన్న ఎప్పుడూ తుంటరివాడే.. అమ్మ మాత్రమే తరచూ మంచిది అవుతూ ఉంటుంది, పిల్లల దృష్టిలో.. కని, పెంచటం అమ్మే అన్నట్లు కనిపిస్తుంది.  నాన్న బాధ్యత ఏమీ లేనట్టు అనిపిస్తుంది. కనటం అమ్మే అయినా కలలు కనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్ధమౌతుంది?

పెంచటం అమ్మే అయినా బాధ్య తెరిగి పెరగటం నాన్నవల్లేనని, కొంతమంది పిల్లలకే బోధపడుతుంది. సేవ చేయటం అమ్మ వంతు,  సరి చేయటం నాన్నతంతు. అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనబడుతాయి, నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతో పాటు దోషాలు కూడా కనబడుతాయి. ప్రేమించటం అమ్మవంతు అయితే, దీవించటం నాన్నవంతు.

ఆకలి తీర్చటం అమ్మ వంతు అయితే..ఆశలు తీర్చటం నాన్నవంతు.  అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతమౌతుంటుంది.  నాన్న దీవెన ప్రతి క్షణం అంతర్గతంగానే ఉంటుంది. అమ్మ గుండెలో పిల్లల సుఖానికి సంబంధించిన ఆలోచనే ఉంటుంది. నాన్నగుండెలో పిల్లల క్షేమానికి అనుబంధించిన ఆవేదనే ఉంటుంది.  అమ్మ ఆరాటాన్ని కన్నీళ్లు చెపుతాయి. నాన్నఆత్రుతని కళ్ళు మాత్రమే చెపుతాయి.

కనిపించే ఆరాటం అమ్మది.. కనిపించని పోరాటం నాన్నది.. అందుకే అమ్మకి  లైకులెక్కువ... నాన్నకి షాకులెక్కువ.. గుర్తింపు తెచ్చుకున్న దేవత అమ్మ, గుర్తింపు పొందలేని దేవుడు నాన్న.. పిల్లల జీవితానికి అమ్మ ఒక కళ అయితే, నాన్న తళతళ. .  కనిపించే దేవత అమ్మ అయితే, కనపడని దేవుడు నాన్న.. పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి.. నాన్నకు మాత్రం అన్నీ నాస్తి.. అందుకే నాన్నల త్యాగాలను గుర్తిద్దాం.. నాన్నకు అర్థం చేసుకుందాం..



మరింత సమాచారం తెలుసుకోండి: