బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దేవాదాయశాఖ కొత్త మార్పులు చేసింది. ఇకపై అమ్మ వారి మూలవిరాట్టును ఇక నుంచి దీపకాంతుల మధ్య మాత్రమే దర్శించుకుంటారు. ఇప్పటివరకూ అమ్మవారి గర్భాలయంలో విద్యుత్ దీపాలు ఉండేవి.. ఆ లైట్ల వెలుతురులోనే దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
ఎందుకంటే.. తమిళనాడు దేవాలయాల్లో ఈ తరహా సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. మన రాష్ట్రంలో ఒక్క తిరుమలలో మాత్రమే ఈ సంప్రదాయం ఉండేది. ఇపుడు దీన్ని కనకదుర్గమ్మ ఆలయంలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యుత్ లైట్ల స్థానంలో తిరుమల తరహాలో దీప కాంతుల్లో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు.
విద్యుత్ దీపాల కంటే సహజసిద్ధమైన నూనెదీపాల వెలుతురు సంప్రదాయబద్ధంగా ఉంటేనే ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని అర్చకులు చెబుతున్నారు. అదే విధంగా నూనె దీపాల వెలుతురులో అమ్మవారి విగ్రహంతో పాటు వివిధ అలంకరణలు సైతం మరింత శోభాయమానంగా కనిపించనున్నాయి.
కనకదుర్గమ్మ ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి ఆలయంలోనూ ఇదే తరహాలో సహజసిద్ధమైన దీపాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా శివయ్యను దీపాల వెలుగుల్లోనే దర్శించుకోవాల్సి ఉంటుంది. దుర్గగుడి ఆగమ పండితులు ఇచ్చిన సలహా మేరకు ఆలయ యంత్రాంగం ఈ మేరకు మార్పులు చేసింది.