శ్రావణమాసం వచ్చింది అంటే చాలు మన తెలుగువారి ప్రతి ఇంటిలో పండుగ శోభ కనిపిస్తుంది.  శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం మన సాంప్రదాయం. ఈ పండుగ వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్  కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా స్త్రీలు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. 

ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని మన విశ్వాసం.  కైలాసంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించాడని అంటారు. 

లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుడు శివుణ్ని కోరగా భోళా శంకరుడు ఈ వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని పార్వతీ దేవికి వివరించినట్లు పురాణాలూ చెపుతున్నాయి.  అదే సందర్భంలో శివుడు పార్వతీ దేవికి చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. 

మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిచ్చింది అంటారు. 

అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు పార్వతీ దేవికి విశదీకరించాడని పురాణ కథనం.  అష్టలక్ష్మిలలో ‘వరలక్ష్మీదేవి’ కి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రం చెపుతోంది.. శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. 

దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మి ని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే. ఈ వరలక్ష్మీవ్రతం ప్రతి ఇంటిలోనూ చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశ్యంతో తరతరాలుగా ఒక సాంప్రదాయంగా ఈ వ్రతాన్ని ఆచరించడం మన హిందూమత సాంప్రదాయాలలో ఒకటి. ఈ రోజున ప్రతి ఇల్లు సకల అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఎపి హెరాల్డ్ కోరుకుంటూ మహిళలందరికీ శుభాకాంక్షలు..



మరింత సమాచారం తెలుసుకోండి: