భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.
ప్రార్థన :
నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
తాత్పర్యం :
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
పురాణ గాధ :
స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.
ఎందుకు ఈ వ్రతం :
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
వ్రత విధి విధానం :
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.
తోరగ్రంథి పూజ :
తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.
ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.
ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.
ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.
ఈ వ్రత విధానం వెనుక భక్తి తత్పరులతోపాటు కళాత్మక దృష్టీ ఉండటం విశేషం. ఈ వ్రత విధానాన్ని గురించి భవిష్యోత్తర పురాణం వివరిస్తోంది. సకల సంపదలు కలిగించే ఉత్తమ వ్రతంగా ఈ వ్రతానికి పేరుంది. వరాలనిచ్చే లక్ష్మి కనుక వరలక్ష్మి అయింది. ఆమె స్త్రీలకు సర్వ సౌభాగ్యాలనూ కలిగిస్తుంది. ఈ వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే స్త్రీలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతానప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ముత్త్తెదువులు, కన్యలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగ స్నానాదులు ముగించుకోవాలి. తర్వాత నూతన వస్త్రాల్ని ధరించి పూజ కోసం నిర్ణయించిన స్థలాన్ని ఆవుపేడతో అలికి, పద్మం ముగ్గుతో తీర్చిదిద్దుతారు. దానిపై ఒక పీట అమర్చి పీట మీద బియ్యం పోసి దాని మీద కలశాన్ని ఉంచుతారు. ఆ కలశం మీద అలంకరించాల్సిన కొబ్బరికాయకు కళాత్మక రీతిలో పసుపు, కుంకుమ, కాటుకలతో కళ్ళు, ముక్కు, చెవులను తీర్చిదిద్దుతారు. అలా అందంగా కళకళలాడుతూ ఉండే వరలక్ష్మీ అమ్మవారి శోభాయమానమైన ముఖాన్ని సిద్ధం చేస్తారు.
శక్తి కొద్దీ అమ్మవారి ముఖానికి పసుపు ముద్దలతో అమర్చిన ముక్కు, చెవులకు బంగారు ముక్కుపుడక, దిద్దులు లాంటివి అమర్చుతారు. కలశం మీద పెట్టాక చక్కగా చీరను అలంకరించి హారాల్నీ వేస్తారు. చూసే వారికి వరలక్ష్మీదేవి ఆ ఇంటికి వచ్చి కూర్చుందా అన్నట్టుగా కనిపిస్తుంది. కొంత మంది ఇవేవీ లేకుండా కేవలం కలశం పెట్టికానీ, అమ్మవారి ప్రతిమలు పెట్టికానీ పూజ చేస్తారు. సాయం సమయంలో ఇరుగు పొరుగు ఉన్న ముత్త్తెదువులు అందరినీ పేరంటానికి పిలిచి కాళ్ళకు పసుపురాసి, నుదుట కుంకుమ పెట్టి, మెడకు గంధాన్ని అద్ది గౌరవిస్తారు. ముత్త్తెదువులందరితో కలసి వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని తెలిపే కథను శ్రవణం చేస్తారు. పూర్వం మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఓ ఉత్తమ స్త్రీ తన భర్తనూ, అత్తమామలనూ భక్తితో సేవించుకుంటూ వారికి తన ప్రేమానురాగాలను పంచుతూ వారి ప్రశంసలు, ఆశీస్సులను అందుకొంటూ ఉండేది.
సన్మార్గవర్తనులైన స్త్రీలకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందన్న సత్యాన్ని ఆమె ద్వారా వరలక్ష్మీదేవి నిరూపించాలనుకుందట. ఓ రోజు చారుమతి కలలోకి వరలక్ష్మీదేవి వచ్చి తాను వరలక్ష్మీ దేవిని, శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజించమనీ, కోరిన వరాలను ఇస్తాననీ చెప్పింది. కలలోనే చారుమతి వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి అర్చించుకుంది. ఆ తర్వాత మెళకువ రాగానే జరిగిన విషయమంతా తన ఇంటి వారికి చెప్పింది. అంతా ఎంతో ఆనందంగా శ్రావణమాసపు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. ఆ రోజు రాగానే చారుమతి ఇరుగుపొరుగు ముత్త్తెదువులందరినీ కలుపుకొని తన ఇంటిలో శాస్త్రవిధిగా, స్వప్నంలో లక్ష్మీదేవి చెప్పిన తీరులో వరలక్ష్మీ అమ్మవారిని ఏర్పాటు చేసి పూజలను నిర్వహించింది. అనంతరం చారుమతి, అక్కడ ఉన్న ముత్త్తెదువులంతా వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణలు చేయటం ప్రారంభించారు. ఒక్కొక్క ప్రదక్షిణం చేస్తుంటే కొన్నికొన్ని దివ్యమైన ఆభరణాలు వారికి తెలియకుండానే వారి శరీరాలకు వచ్చి చేరాయి.
ఆ స్త్రీల గృహాలన్నీ ఐశ్వర్యాలతో నిండిపోయాయి. అలా వరలక్ష్మీదేవి కటాక్షం ఆ స్త్రీలందరికీ ప్రాప్తించింది. సంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ కథలానే కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలనూ ఇస్తానని చెప్పింది. చారుమతి ఆ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చెయ్యలేదు. తనతోపాటు తన వారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో, నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఓ సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది.
వైద్య రహస్యాలు :
శ్రావణం వర్షాకాలమైన కారణం గాను , రాబోయే భాద్రపదమాసం కూడా వర్షాలతోనే ఉండే కారణం గానూ ..
పసుపు ని పాదాలకి రాసుకుంటే జలుబు , రొంప మొదలైన వ్యాధులు రావు .మొలకెత్తిన శనగల్ని ఈ 2 నెలలు పాటు ప్రసాదము గా తినడం వల్ల శరీరానికి పోషక విలువలు గల ఆహారము అందివ్వడం వల్ల శరీర వ్యాధి నిరోధక శక్తి పఠిస్టమవుతుంది .
ప్రతి స్త్రీ కూడా బొట్టు , కాటుక , గందము ,మట్టెలు . పూలు , పట్టుచీర నగలు తో నిండుగా ఉండడం వల్ల సూక్ష్మ జీవులు దరికి రావు .
తాంబూలము వేసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరమవుతుంది .
చిత్ర దీపం పేరిట (బెల్లము , వరిపిండిని ముద్దగా చేసి కుందెగా మలిచి , దాంట్లో ఆవునేతితో దీపాన్ని వెలిగించి ఆ దీపం కొండెక్కిన తర్వాత ) పెట్టిన దీపం తినడం వల్ల దానికున్న ఔషద గుణాల కారణం గా వర్షాకాలము లో దాగి యున్న ఏ వ్యాధి స్త్రీల దరికి చేరదు .
స్త్రీల తో కూడా పురుషులు ఈ ప్రసాదాదులు ఆరగించడం వల్ల మగవారికి ఈ లాభాలు అందుబాటులో ఉంటాయి .
పండుగ చేసి ఇరుగు పొరుగు వారితోను , బంధుమిత్రులతోను కలిమి - చెలిమి సంబంధాలు -- కుటుంభ వ్యవస్థను పటిస్ఠ పరచి మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని కలిగిస్తాయి కాబట్టి మానసిక రుగ్మతలకు దూరముగా ఉండవచ్చును .
సమాజ ప్రయోజనాలు :
మన సంప్రదాయాల్లో పూజలూ.. వ్రతాల వెనుక శాస్త్రీయమైన కారణాలనేకం. అన్నీ ఆలోచించి.. ఏయే కాలాల్లో ఏమేం చేస్తే ఇల్లు.. ఊరు.. సమాజం ఆరోగ్యంగా ఉంటాయో .... ఆనాడు పెద్దలు ఆలోచించి ప్రవేశపెట్టినవే ఇవన్నీ. పుణ్యం మాట పక్కనబెడితే.. మనం చేసే కొన్ని పనుల వల్ల శారీరకంగా.. మానసికంగానూ.. ఎంతో దృఢంగా.. ఆరోగ్యంగా ఉండాలన్నదే వీటి ఉద్దేశం.
ఉత్తరాయణం, దక్షినాయణానికి మధ్యస్థంగా శ్రావణ మాసం వస్తుంది. ఇది వర్షాకాలం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అన్ని పంటలూ పండే కాలం. వర్షాలకు గ్రామాల్లోని చెత్తాచెదారం కొట్టుకుపోయి సమీపంలోని చెరువుల్లో చేరతాయి. సారవంతమైన మట్టి పొలాలకు చేరుతుంది. బావులు, చెరువులు నీటితో నిండుతాయి. పశువులకు కావాల్సిన గ్రాసం దొరుకుతుంది. అందరికీ చేతినిండా పనులు.. తద్వారా సొమ్ములు. అందుకే సకల సంపదలను కలిగిస్తుందని
శ్రావణమాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. సర్వ సౌభాగ్యాలను కలగజేస్తుందని మహిళలు ఈ పూజను విధిగా చేస్తారు. ఇళ్లు వాకిళ్లను శుభ్రం చేసుకుని.. తోరణాలతో అలంకరించి పూజలు చేస్తారు. వరలక్ష్మీ వ్రతం సకల శుభాలను కలగజేయడమే కాకుండా శాస్త్రీయంగా ఇంటికి, వంటికి, సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని పురోహితుడు దర్భముళ్ల కామేశ్వరశర్మ తెలిపారు. అందుకే వరలక్ష్మీ పూజ ఆరోగ్య ప్రదమని వివరించారు.
ఎన్నో ఉపయోగాలు :
వరలక్ష్మీ వ్రతానికి తొమ్మిది రకాల పుష్పాలు, పిండివంటలు, పత్రి, పండ్లను ఉపయోగిస్తారు. వీటివల్ల ఎన్నో ఉపయోగాలు. వరలక్ష్మీ దేవిని ఆరాధించడానికి, నైవేద్యం పెట్టడానికి ఉపయోగించే సామగ్రి, వంటల్లో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.
* వరలక్ష్మీ నైవేద్యానికి పూర్ణం బూరెలు, పులగం, గారెలు, పరమాన్నం, చక్కెరపొంగలి, పులిహోర, పెసరబూరెలు, గోధుమ ప్రసాదం తయారు చేస్తారు. వీటికోసం బియ్యం, పెసరపప్పు, పంచదార, జీలకర్ర, మినపప్పు, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్‌మిస్, వేరుశనగపప్పు, మజ్జిగ, గోధుమనూక వంటివి వినియోగిస్తారు. దీనినే ప్రసాదంగా భుజిస్తారు. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో ఉపకరిస్తాయి. ఇటువంటి ఆహారం తరుచూ తీసుకుంటే అనారోగ్యం దరి చేరదని పెద్దలు చెబుతున్నారు.
* పూజకు ఉపయోగించే పత్రి ఇంటి పరిసరాలకే కాకుండా శరీరానికి కూడా ఉపకరిస్తాయి. ఉసిరిక, మారేడు, నేరేడు, జమ్మి, దుచ్చిన, రావి, వెలగ, మారేడు, అత్తి, జాజి వంటివి పూజకు ఉపయోగిస్తారు. వీటిని వల్ల గాస్టిక్ సంబంధ ఇబ్బందులు, మహిళలకు రుతుసంబంధ సమస్యలు, చర్మసంబంధ రోగాలు, దంత, నోరు, కంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాస సంబంధ రోగాలు కూడా నయమవడానికి పత్రి ఎంతో ఉపయోగపడుతుంది.
* ఇక వరలక్ష్మి వ్రతం రోజే మొగలిపువ్వును వినియోగిస్తారు. ఇది పరిసరాలను చాలా ప్రభావితం చేస్తుంది. తొమ్మిది రకాల పుష్పాలతో పూజ చేస్తారు. వీటివల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏకాగ్రతను పెంచుతుంది. మహిళల్లో ముఖవర్చస్సు పెంచుతుంది. తలలో పేలు రాకుండా పుష్పాలు ఉపకరిస్తాయి. తలపోటు, కళ్లనొప్పులు రాకుండా పువ్వులు కాపాడతాయి. అందుకే పూజలో ఉంచిన పువ్వులను మహిళలు స్వయంగా తలలో ఉంచుకుంటారు. పేరంటానికి వచ్చిన ఇరుగుపొరుగు వారికి పెడతారు.
* వరలక్ష్మీ వ్రతంలో ప్రధానంగా తొమ్మిది రకాల పండ్లను నైవేద్యంగా పెడతారు. వీటినే ప్రసాదంగా తీసుకుంటారు. పండ్ల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిసినా.. వినియోగం తక్కువ. ఇలాంటి పూజల సందర్భాల్లోనైనా ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయని పెద్దల ఉవాచ. బలమైన కండరాలు, దృఢమైన ఎముకలు, మెరిసే కళ్లు, ముడతల్లేని చర్మం, వంకర్లు లేని దేహం, నల్లటి శిరోజాలు, తెల్లని దంతాలు, చక్కని జీర్ణశక్తి, సమృద్ధిగా రక్తం, ఎత్తుకు తగిన బరువు, అంటు వ్యాధులను దరిచేరదీయని రోగ నిరోధక వ్యవస్థ ఉండాలంటే పోషక పదార్థాలను తీసుకోవాలి. ఇవి ఉండాలంటే పండ్ల ద్వారానే సాధ్యం. ప్రోటీన్లు, విటమిన్లు, నీరు, కాల్షియం వంటివి ఒక్కో పండు ద్వారా లభిస్తుంది. సంప్రదాయం పేరుతో వీటిని ఉపయోగించాలని పెద్దలు చెబుతున్నారు.
* ఇక వరి దుబ్బును కూడా తప్పనిసరిగా పూజిస్తారు. వరి వల్ల మనకు ఆహారం లభిస్తుంది. గడ్డి పశువులకు ఆహారం. ధాన్యం ఇంటికి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్లేనని గ్రామీణులు భావిస్తారు. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తూనే.. ప్రకృతిని కూడా మర్చిపోకూడదని వరిదుబ్బులకు పూజ చేస్తారు.
* మహిళలు పూజలో ఎంతోకొంత బంగారం పెడతారు. ఇది ఆర్థిక స్థోమతును బట్టి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొనుగోలు చేయటం ద్వారా కొంత బంగారం సమకూర్చుకునే అవకాశం ఉంది.
వరలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు ...... సర్వేజనా సుఖినోభవంతు