ఒకసారి యమలోకంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవంలో నాట్యకత్తెలు నృత్యం చేస్తున్నారు. అందులో తిలోత్తమ నాట్యం చేస్తుండగా చూసి యముడు ఆమెను మోహించాడు. అందుకు పర్యవసానంగా అనిలాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు జన్మించాడు. అనిలాసురుడు ఎక్కడికెళ్లినా అగ్ని ఉద్భవించి అంతా భస్మీపటలం అయ్యేది. అటువంటి భయంకరమైన రాక్షసుడు దేవతలపై దండెత్తుతాడు. అప్పుడు దేవతలు భయకంపితులై గణపతిని ప్రార్థిస్తారు. దేవతల ప్రార్థనలు విన్న వినాయకుడు బాలగణేశుని రూపంలో ప్రత్యక్షమై అనిలాసురుణ్ణి సంహరిస్తానని మాటిస్తాడు.
గరికతో ప్రసన్నం 

ఆ మాటలు విన్న దేవతలు సంతోషిస్తారు. అదే సమయంలో నలుదిశలు భస్మం చేస్తూ అనిలాసురుడు అక్కడికి వచ్చాడు. ఆ రాక్షసుణ్ణి చూసి దేవగణమంతా తలోదిక్కూ పారిపోయారు. బాలగణేశుడు మాత్రం అక్కడే నిలుచుని ఉన్నాడు. అదిచూసి అనిలాసురుడు బాలగణేషున్ని మింగేయాలని ముందుకు వచ్చాడు. కానీ బాలగజాననుడే పర్వతమంత ఎత్తు ఎదిగి అనిలాసురుణ్ణి మింగేశాడు. సాక్షాత్తు అగ్నిస్వరూపుడైన అనిలాసురుణ్ణి మింగిన కారణంగా గణేశునికి ఒళ్లంతా మంట పుట్టింది. ఆ మంటను భరించలేక గణేశుడు నేల మీద పడి దొర్లసాగాడు. గణేశుని బాధ చూసి దేవతలంతా అక్కడకు వచ్చారు.


గణేశుని బాధను తగ్గించడానికి రకరకాల ఉపాయాలు ఆలోచించారు. ఇంద్రుడు గణేశుని తలమీద అమృతమయమైన చంద్రుణ్ణి ఉంచాడు. బ్రహ్మదేవుడు సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు కన్యలను రప్పించాడు. విష్ణుమూర్తి తన చేతిలోని చల్లటి కమలం ఇచ్చాడు. వరుణుడు చల్లటి వర్షం కురిపించాడు. శివుడు తన సర్పాన్ని గణేశుడి ఉదరానికి చుట్టాడు. ఇవన్నీ చేసినా మంటలు చల్లారలేదు. అప్పుడు 88వేల మంది మునులు ప్రతి ఒక్కరు 21 పచ్చటి గరికలు గజాననుడి శిరస్సుపై ఉంచారు. అప్పుడు గణేశుని దేహం చల్లారి శాంతి పొందింది. గణేశుడు ప్రసన్నమై ఇలా సెలవిచ్చాడు. ‘ఈ రోజు నుంచి నాకు గరికలు సమర్పించే వారికి కొన్ని వేల యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది’ అన్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: