ఇప్పటికే రెండు గోదావరి జిల్లాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. పండుగలో భాగంగా రెండు గోదావరి జిల్లాలలో జరిగే కోడి పందాలు మరియు హరిదాసు కథలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో జరిగే కోడిపందాల క్రీడా కోసం ఇతర రాష్ట్రాల నుండి అనేకమంది వస్తుంటారు.
ఈ పందాలు ప్రపంచ పురాతన పందాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి. 6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియా లో కోడి పందాలు జరిగాయని తెలుస్తున్నది. మన రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ ఏర్పాట్లతో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ పందెం కోసం ప్రత్యేకంగా పెంచే కోడిపుంజులను పందెం కోళ్ళు అంటారు. వీటి ఆహార విషయంలో యజమానులు ఎంతో శ్రద్ధ వహించి పెంచుతారు.
పందెం సమయంలో పందెం కోడి కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలోకి దించుతారు. ఒకపక్క ప్రభుత్వాలు మరియు కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించిన మరోపక్క మాత్రం పందెం రాయుళ్లు తమ పని తాము చేసుకుని వెళ్లిపోతుంటారు. ఏది ఏమైనా రానున్న సంక్రాంతి గురించి ఇప్పటికే చాలా మంది పందెంరాయుళ్ళు రెండు గోదావరి జిల్లాలలో దిగిపోయారు.