శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన పుణ్యదినమే ఈ నరకచతుర్దశి. నిజానికి దీపావళి ప్రాముఖ్యత అంతా ఈ నరకచతుర్దశి రోజునే ఉంది. ఈ రోజున మన పెద్దలు సూచించిన నియమాలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను గమనిస్తే వారి మేధకు ఆశ్చర్యపోక తప్పదు! మరియు కొంతమంది ఈ పండుగకు పితృదేవతలు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్థుల నమ్మకం. కాబట్టి వారు ధనత్రయోదశి నాడు సాయం కాలం తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పితృదేవతలకు దారి చూపిస్తుందని వారి విశ్వాసం.


నరకచతుర్దశినాడు.. దక్షిణ దిక్కుకేసి దీపాలను వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబుతారు.దీపావళి ప్రేతచతుర్దశి అనే పేరు కూడా వుంది. అందుకే పితృదేవతలను పూజించే దిశగా దక్షిణం వైపు దీపమెట్టాలని పండితులు చెప్తున్నారు. ఏ స్థాయిలో వున్నా.. నరకచతుర్దశి నాడు తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకునే అవకాశమే ఈ దక్షిణ దీపమని వారు అంటున్నారు. 


నరకచతుర్దశినాటినుంచే మనం దీపాలను వెలిగిస్తాము. ఈ రోజు ఆలయాల్లో నువ్వులనూనెతో చేసిన దీపాలను విరివిగా పెడతారు. దీపం నుంచి వెలువడే పొగ, అది వాతావరణం మీదా, చుట్టూ ఉన్న మనుషుల మీదా చూపించే ప్రభావాన్ని బట్టి నువ్వులనూనె దీపారాధనకు శ్రేష్ఠమని మన పెద్దలు నిర్ణయించారు. పైగా చలికాలానికి ముసురుకునే క్రిమికీటకాదులను దూరంగా ఉంచే వెలుతురు, వేడిని ఈ దీపారాధన కలుగచేస్తుంది.


నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా చేర్చుకోవడం ముఖ్యం. నువ్వుల శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: